ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ (54) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఉదయం 5.30 గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్‌పై వెంకట్ వివిధ చిత్రాలు నిర్మించారు. వెంకట్ పూర్తి పేరు జె.వి. వెంకట్ ఫణీంద్ర రెడ్డి.
వెంకట్ మొత్తంగా 14 సినిమాలు నిర్మించారు. ‘ది ఎండ్’ , ‘సామాన్యుడు’, ‘మాయాజాలం’ , ‘హంగామా’, ‘గుండమ్మగారి మనవడు’, ‘బహుమతి’, ‘కిక్’ , ‘ప్రేమ కావాలి’, ‘డాన్ శ్రీను’,‘ పైసా’, ‘ఢమరుకం’, ‘బిజినెస్‌మెన్’ , ‘లవ్లీ’ , ‘విక్టరీ’, తోపాటు ఇంగ్లిష్‌లో ‘డివోర్స్ ఇన్విటేషన్’ తదితర చిత్రాలు నిర్మించారు.
వెంకట్ నిర్మాతగానే కాకుండా… సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. అందుకుగాను ఆయనకు కొలంబో విశ్వవిద్యాలయంలోని ఓపెన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఫర్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్ నుండి గౌరవ డాక్టరేట్ కూడా వచ్చింది. 2011లో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు.