కోలీవుడ్ లో ‘కాట్రువెలియిడై’ ‘సెక్క సివందవానం’ వంటి చిత్రాలతో అక్కడి ప్రేక్షకులని అలరించిన అదితి రావు హైదరి.. అటు తరువాత బాలీవుడ్ లో ‘పద్మావత్’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇక ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంతో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో తన నటనతో మంచి మార్కులే వేయించుకుంది. ఈ చిత్రంతో ఇక బిజీ అయిపోతుంది ఈ భామ అని అంతా అనుకున్నారు కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఇక ప్రస్తుతం నాని, సుధీర్ బాబు ల మల్టీ స్టారర్ చిత్రం ‘వి’ లో నటిస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ట్రోలింగ్ కు కూడా గురవుతుంటుంది ఈ భామ.
అయితే ఈ ట్రోలింగ్ ను మీరు ఎలా తీసుకుంటారు అని ఈమెను ఓ ఇంటర్వ్యూలో అడుగగా.. ఈమె చేసిన కామెంట్స్ ట్రోల్ చేసే వారినే ట్రోల్ చేసే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. అదితి మాట్లాడుతూ.. “నన్ను ట్రోల్ చేసే వారి గురించి ‘పాపం’ అని జాలి పడతాను. అలావిమర్శలు చేసేవారి నుంచి దూరంగా మేము పారిపోలేము. ఎలాంటి విమర్శలనైనా నిజాయితీగా స్వాగతించాలి.. తప్పదు…! ఇతరుల పై ట్రోలింగ్ చేసేవారు ఏదో సమస్యతో బాధపడుతున్నారన్నది నా భావన. అలాంటి వారికి ఏదో విషయం పై కోపం ఉండి ఉంటుంది, లేకపోతే వారి జీవితం మీద వారికే విరక్తి కలిగి ఉండవచ్చు. ఆ కోపాన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ ద్వారా తీర్చుకుంటున్నారు. అలాంటి వారికి మనం ఒక్కటే చేయగలం. అది వారిని చూసి జాలి పడడమే…! అంతేకాకుండా వారు బాగుండాలని నేను భగవంతుడిని ప్రార్దిస్తుంటాను. ఈరోజు వాళ్ళకు మధురమైన రోజుగా గడవాలని ప్రార్ధిస్తుంటాను. వారు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాటి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటాను.” అంటూ చెప్పుకొచ్చింది.