కరోనా వైరస్ వ్యాప్తి ఊహకు మించిన ప్రమాదంగా మారుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాయి. దేశంలోని ప్రధాన రవాణా వ్యవస్థలను నిలిపివేయడం జరిగింది. అనేక రాష్ట్రాలలో కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవల కొరకు మినహా ప్రజలు బయటికి రాకూడని ఆదేశాలు జారీచేయడం జరిగింది. అలాగే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ పేరుతో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. అలాగే కఠిన పరిస్థితులలో రోగులకు అండగా నిలబడి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలను అభినందిస్తూ నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరు తమ ఇంటి బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టాలని కోరారు. ఇలా చేసి కరోనా పై యుద్ధంలో సైనికులులా పోరాడుతున్న సిబ్బందిలో స్ఫూర్తి నింపాలని, వారిని అభినందించాలి పిలుపునివ్వడం జరిగింది.
కాగా ఈ క్లాపింగ్ కాన్సెప్ట్ విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సామాన్యుల నుండి సెలెబ్రిటీస్ వరకు ఈ కార్యక్రమంలో విధిగా పాల్గొన్నారు. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు, హీరోయిన్స్ మరియు దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు సాయంత్రం 5 గంటలకు క్లాప్స్ కొట్టి, బెల్స్ మోగించి తమ వంతు బాధ్యత నెరవేర్చారు. టాలీవుడ్ నుండి చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్, పవన్, చరణ్, ప్రభాస్, బన్నీ, వెంకటేష్, మోహన్ బాబు, లతో పాటు అనేక మంది హీరోలు ఈ కార్యక్రమంలో ఉత్సహంగా పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ఒకతాటిపైకి వచ్చి చప్పట్లు చరిచి, సందడి చేసి చుట్టూ ఉన్న వారిలో భీతిని పారద్రోలారు. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలం అని చాటిచెప్పారు. విపత్కర పరిస్థుతులలో ఈ క్లాపింగ్ ప్రోగ్రాం పాజిటివ్ ఎనర్జీ మరియు ప్రజలలో ఆశాభావం నింపింది.