విజయే నెంబర్ 1 తర్వాతే రజిని .. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోల లిస్ట్..!

  • February 23, 2023 / 11:09 AM IST

ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు.. కంటెంట్ బాగుందంటే అన్ని భాషల్లోని చిత్రాలను చూస్తున్నారు. ఇది డబ్బింగ్ సినిమా అని విభజించి చూడటం లేదు, బౌండరీస్ పెట్టుకోవడం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఇది మొదటి నుండి అలవాటే. మిగతా భాషల్లోని, రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులు.. లాక్ డౌన్ టైం నుండి ఇలా పక్క భాషల్లోని చిత్రాలను చూడటం అలవాటు చేసుకున్నారు. అందుకే పక్క భాషల్లోని హీరోలకు కూడా తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే తెలుగు ప్రేక్షకులను మొదటి నుండి తమిళ డబ్బింగ్ సినిమాలు ఎక్కువ అలరించాయి. ఎక్కువ సక్సెస్ అయినవి కూడా తమిళ సినిమాలే..! ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ అనేది పెద్ద మార్కెట్ కలిగిన ఇండస్ట్రీగా పేరొందింది.

అందుకే తమిళ హీరోల సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం… ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యి వంద రోజుల వేడుకలు జరుపుకోవడం వంటివి జరిగాయి. ‘ప్రేమిస్తే’ వంటి ముక్కు మొహం తెలీని హీరో సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఆ సినిమా తెలుగులో కూడా రూ.10 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటే.. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ఎంత ఇష్టం అనేది అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది తమిళ హీరోలకు మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్న వాళ్ళ సంఖ్య తక్కువే. ఇప్పటి ట్రెండ్ ను బట్టి తెలుగులో ఎక్కువ మార్కెట్ ను కలిగిన తమిళ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) విజయ్ :

దళపతి విజయ్ .. సినిమాలు గతంలో తెలుగులో డబ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ‘తుపాకి’ తర్వాత విజయ్ సినిమాలకు తెలుగులో డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు విజయ్ నటించే సినిమాలు తరచూ తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. అతని తెలుగు థియేట్రికల్ మార్కెట్ ఇప్పుడు రూ.15 కోట్లు పలుకుతుంది.

2) రజినీకాంత్ :

గతంలో రజినీకాంత్ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్ల వరకు పలికేవి. అయితే ఈ మధ్య కాలంలో రజినీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోవడంతో అది రూ.12 కోట్లకు పడిపోయింది.

3) సూర్య :

నిజానికి సూర్యని తెలుగు హీరోలానే ఫీలవుతూ ఉంటారు ఇక్కడి జనాలు. సూర్యకి తెలుగులో రూ.18 కోట్ల వరకు థియేట్రికల్ మార్కెట్ ఏర్పడింది. రజినీకాంత్ తర్వాత సూర్య అనే విధంగా సూర్య తెలుగులో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కానీ ఇప్పడు అతని మార్కెట్ బాగా పడిపోయింది. ప్రస్తుతం తెలుగులో సూర్య మార్కెట్ రూ.6 కోట్లు మాత్రమే ఉంది.

4) కార్తీ :

సూర్య తమ్ముడు కార్తీ కూడా తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇతను హీరోగా నటించిన ‘ఆవారా’ చిత్రం రూ.10 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది. కానీ తర్వాత వచ్చిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇతని మార్కెట్ రూ.5 కోట్లకు పడిపోయింది. ‘ఖైదీ’ ‘సర్దార్’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టినా.. ఇంకా కార్తీ తెలుగు థియేట్రికల్ మార్కెట్ రూ.5 కోట్లుగా మాత్రమే ఉంది.

5) కమల్ హాసన్ :

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు తెలుగులో ఒకప్పుడు చాలా మంచి మార్కెట్ ఉండేది. ఎక్కువ స్ట్రైట్ తెలుగు సినిమాల్లో నటించిన హీరో కూడా కమల్ అనడంలో సందేహం లేదు..! అయితే వరుస ప్లాపుల ఇతన్ని వెనక్కి నెట్టాయి. తెలుగులో కమల్ హాసన్ కు రూ.4.5 కోట్ల నుండి రూ.5 కోట్ల వరకు థియేట్రికల్ మార్కెట్ ఉంది.

6) విక్రమ్ :

‘శివ పుత్రుడు’ ‘అపరిచితుడు’ చిత్రాలతో విక్రమ్ కి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అతను హీరోగా నటించిన ‘మల్లన్న’ ‘ఐ’ వంటి సినిమాలకు రూ.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ అవి ఆడలేదు. తర్వాత విక్రమ్ నటించిన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో అతని తెలుగు థియేట్రికల్ మార్కెట్ రూ.4 కోట్లు మాత్రమే ఉంది.

7) శివ కార్తికేయన్ :

‘వరుణ్ డాక్టర్’ ‘కాలేజ్ డాన్’ వంటి సినిమాలతో శివ కార్తికేయన్ కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇతనికి కూడా తెలుగులో రూ.4 కోట్ల వరకు థియేట్రికల్ మార్కెట్ ఉంది.

8) విశాల్ :

ఇతనికి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. ‘పందెం కోడి’ ‘పొగరు’ ‘భరణి’ ‘అభిమన్యుడు’ వంటి సినిమాలు తెలుగులో రూ.10 కోట్లు పైనే కలెక్ట్ చేశాయి. అయితే వరుస ప్లాపుల వల్ల ఇతని మార్కెట్ పడిపోయింది. ప్రస్తుతం విశాల్ సినిమాలకు తెలుగులో రూ.3 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది.

9) అజిత్ :

మొదటి నుండి అజిత్ ఎందుకో తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టలేదు. కానీ అజిత్ సినిమాలకు కూడా తెలుగులో డిమాండ్ ఉంది. అతను ఫోకస్ చేయకుండానే రూ.2.5 కోట్ల నుండి రూ.3 కోట్ల వరకు థియేట్రికల్ మార్కెట్ ను సంపాదించుకున్నాడు అజిత్.

10) ఆర్య :

‘వరుడు’ చిత్రంలో విలన్ గా నటించి తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఆర్య.’నేనే అంబానీ’ ‘రాజా రాణి’ ‘ఆట ఆరంభం’ వంటి చిత్రాలతో ఇతనికి కూడా తెలుగులో రూ.2 కోట్ల వరకు థియేట్రికల్ మార్కెట్ ఏర్పడింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus