రెండున్నర గంటల పాటు తమ కష్టాన్ని మరిచిపోయి ఆనందించాలని ఎక్కువమంది థియటర్ కి వస్తారు. నటీనటులు నవ్వితే నవ్వుతారు, ఏడిస్తే ఏడుస్తారు.. హీరో అన్యాయం పై పోరాడితే అది తానేనని మురిసిపోతారు. అలా ప్రేక్షకుడిని సినిమాని ఇన్వాల్వ్ చేస్తే ఆ సినిమా విజయవంతం అవుతుంది. వినోదాన్ని పంచుతూనే కొంత మెసేజ్ ని తెలియకుండా మనసులోకి ఇంజెక్ట్ చేయించగల డైరక్టర్లు శంకర్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరు సమాజంలో ఉన్న సమస్యను, అందుకు పరిష్కారాన్ని సున్నితంగా చెబుతూ ప్రేక్షకులకు మంచి సందేశాన్ని చేరవేస్తారు. ఎంటర్టైన్మెంట్ ని మాత్రం ఎక్కడా మిస్ చేయరు. అలాగే కొత్త డైరక్టర్ సతీష్ వేగ్నేశ కూడా రచయిత కుటుంబం నుంచి వచ్చిన దర్శకుడే. తన బలం… మాటలు. “శతమానం భవతి”లో సంభాషణలు కీలకపాత్ర పోషించాయి. బహుశా.. ఆ విషయం ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనేమో… “శ్రీనివాస కల్యాణం”లో అనవసరమైన డైలాగులు కాస్త ఎక్కువగా రాసేసుకున్నాడు.
నితిన్ తో ప్రతీచోటా ప్రేక్షకులకు క్లాస్ పీకేందుకు సిద్ధమయ్యాడు. ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సందర్భంలోనూ, శుభలేఖ సుధాకర్ సన్నివేశాల్లోను నితిన్ క్లాసు తీసుకునే విధానం ప్రేక్షకులకు తలనొప్పిగా మారింది. ప్రకాష్ రాజ్‌తో చేసే వాదనలు కూడా దాదాపుగా క్లాసులుగానే భావించారు. దీంతో సినిమాని ఎంజాయ్ చేయడం మానేసి.. సెటైర్లు వేయడం మొదలెట్టారు. “సరదాగా సినిమా చూడ్డానికి వస్తే ఈ క్లాసుల గోలేంటి?” అని విమర్శిస్తున్నారు. ఆ విషయాన్ని థియేటర్ నుంచి బయటికి రాగానే ప్రతి ఒక్కరికీ చెప్పారు. మౌత్ టాక్ కి మించిన పబ్లిసిటీ ఏముంది.. అందుకే “శ్రీనివాస కల్యాణం” కలెక్షన్లు లేక డీలాపడిపోయింది. ఈ సినిమాతో “క్లాసులు పీకితే చూడరు బాసూ” అని దర్శకనిర్మాతలకు మరోసారి అర్ధమయింది.