‘పొన్నియిన్ సెల్వన్’లో త్రిషను చూసి అభిమానులు, ప్రేక్షకులు మంత్రముగ్దులు అయిపోయారు. అంత అందంగా చూపించారు దర్శకుడు మణిరత్నం ఆమెను. ఆమె కూడా అంతే క్యూట్‌గా కనిపించింది. మాటలు కూడా మహా ముద్దుగా ఉన్నాయి అని అంటారు. ఆ పాత్ర కోసం ఆమె పడ్డ కష్టం కూడా అలాంటిలాంటిది కాదట. ఆ సినిమాలోని కుందవై పాత్ర కోసం ఏకంగా ఆమె ‘పొన్నియిన్ సెల్వన్’ పుస్తకాన్నే చదివిందట. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఇటీవల విడుదలై తమిళనాట మంచి టాక్, తెలుగులో ఫర్వాలేదనిపించుకునే టాక్ సంపాదించుకుంది.
ముందుగా చెప్పినట్లు అందులో త్రిష.. కుందవై అనే పాత్రలో నటించింది. అయితే కుందవై గురించి పూర్తిగా తెలుసుకునే క్రమంలో త్రిష… కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను పూర్తిగా చదివిందట. ‘‘పొన్నియిన్ సెల్వన్ 1’ సినిమా షూటింగ్ మొదలు పెట్టగానే ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. కరోనా, ఆ తర్వాత లాక్‌డౌన్ పరిస్థితులతో అంతా స్తంభించిపోయింది. దీంతో ఆ సమయంలో కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఐదు భాగాలనూ పూర్తిగా చదివేశాను’’ అని చెప్పింది త్రిష.
చరిత్ర పుస్తకాలను చదవడం కష్టమని త్రిష అనుకుంటుందట. ఇన్నాళ్లూగా అలానే భావించిన త్రిష.. ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను మాత్రం ఆసక్తిగా చదివేసింది. నవలలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందట. అలా ఒక పుస్తకం అయిపోగానే మరొక పుస్తకం మొదలుపెట్టేసిందట. అలా నవలను పూర్తిగా చదివాను అని చెప్పింది త్రిష.
అయితే ఆమె నవల చదివాక ఆశ్చర్యంగా అనిపించిందట. అదే ఐదు భాగాలున్న నవలలోని కథను దర్శకుడు మణిరత్నం రెండు భాగాల్లో చూపించడానికి సిద్ధం చేశారు అని అనుకుందట. అసలు ఆయన ఈ పని ఎలా చేస్తున్నారు అని కూడా అనుకుందట. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. త్రిషతోపాటు విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్ తదితరులు నటించారు.