చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక సారి హిట్ కొడితే ఆ టీమ్ తోనే మరో సినిమా చేయడానికి డైరక్టర్లు ఇష్టపడుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇందుకు అతీతులు కారు. డైరక్టర్ గా నిలబడిన తర్వాత వరుసగా ఒకే టీమ్ తో సినిమాలు చేసేవారు. మ్యూజిక్ డైరక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్, కెమెరా మెన్ గా ప్రసాద్ మూరెళ్ల తప్పక ఉండేవాళ్ళు. ఈ టీమ్ హ్యాట్రిక్ కూడా అందుకుంది. “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమా తర్వాత దేవిశ్రీ ప్రసాద్, ప్రసాద్ లకు త్రివిక్రమ్ బై చెప్పారు. “అఆ”కు మిక్కీ జే మేయర్ స్వరాలూ సమకూర్చగా.. నటరాజ్ సుబ్రమణ్యన్ కెమెరామెన్ గా వ్యవహరించారు. ఇది హిట్ అయింది.
అయినా మళ్ళీ ఇద్దరిని మార్చివేశారు. “అజ్ఞాతవాసి”కి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చారు. మణికందన్ ఛాయాగ్రహణం అందించారు. ఈ సినిమా ఫెయిల్ అయింది. అయినా త్రివిక్రమ్ మారలేదు. నెక్స్ట్ సినిమాకి టెక్నీషియన్స్ ని మార్చి వేస్తున్నారు. ఎన్టీఆర్ తో చేయనున్న ఫ్యామిలీ డ్రామా మూవీకి థమన్ మ్యూజిక్ అందించనున్నారు. పి.ఎస్.వినోద్ ను కెమెరామెన్ గా తీసుకున్నారు. ఈయన గతంలో “మనం”, “ఊపిరి”, “ధృవ” లాంటి సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు త్రివిక్రమ్ టీమ్ లో భాగస్వాములయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనుంది.