సినిమాను ప్రమోట్ చేయడం కోసం మన సెలబ్రిటీలు విడుదల చేసే పోస్టర్లు, టీజర్లు, సాంగ్ ప్రోమోలకు చిత్రవిచిత్రమైన పేర్లు పెడుతుంటారు. మహేష్ బాబు “భరత్ అనే నేను” మొదటి ప్రోమోకు ఫస్ట్ ఓత్ అని రిలీజ్ చేస్తే.. “నా పేరు సూర్య” టీజర్ కి “ఫస్ట్ ఇంపాక్ట్” అని పేరు పెట్టారు. ఇక సదరు టీజర్స్, ప్రోమోస్ రిలీజ్ చేసే టైమ్ లో అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఆడియో ఫంక్షన్ లో యాంకర్లు ఇచ్చేదానికంటే భీభత్సమైన ఉపోద్ఘాతాలు ఇవ్వడం మనోల్లా ప్రత్యేకత. ఇప్పుడు ఈ గోల అంతా ఎందుకురా అంటే.. ఆగండాగాందీ ఆ విషయానికే వస్తున్నా.
ఇవాళ విడుదలైన “ఇస్మార్ట్ శంకర్” సినిమాలోని “ఉండిపో” అనే మెలోడీ సాంగ్ కోసం ఛార్మీ ఒక రెండు గంటల ముందు పోస్టర్ పోస్ట్ చేస్తూ.. “మౌత్ వాటరింగ్ విజువల్స్” (సొంగ కార్చుకొనే స్థాయిలో ఉంటుంది) అని ట్వీట్ చేసింది. ఒకప్పుడు నిజంగానే కుర్రాళ్ళు చొంగ కార్చుకొనేలా చేసిన ఛార్మీ అలాంటి పోస్ట్ పెట్టేసరికి నిజంగానే సాంగ్ ఆ రేంజ్ లో ఉంటుందేమో అనుకొన్నారు అందరూ. సాంగ్ రిలీజ్ అయ్యాక యూట్యూబ్ లో సదరు సాంగ్ విజువల్స్ ను చూసినవాళ్ళందరూ “ఏముంది అక్కడ చొంగ కార్చుకోవడానికి?” అని ఛార్మీని తిట్టుకొన్నారు. మణిశర్మ బాణీ కూడా ఎక్కడో విన్నట్లే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇదివరకూ విడుదల చేసిన “జిందాబాద్ జిందాబాద్” వినడానికి వినసోంపుగా, ఆ లిరికల్ వీడియోలోని స్టిల్స్ రోమాంటిక్ గా ఉన్నాయి.