యువరాజ్ గణేశన్ - మహేష్ రాజ్ పసిలియన్ - నజేరాత్ పసిలియన్ (Producer)
సియాన్ రోల్డాన్ (Music)
శ్రేయాస్ కృష్ణ (Cinematography)
Release Date : ఫిబ్రవరి 10, 2024
“గుడ్ నైట్” అనే తమిళ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మణికందన్. అతడి తాజా చిత్రం “లవర్” ట్రైలర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడం. సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీ గౌరిప్రియ తెలుగమ్మాయి కావడంతో “లవర్”ను “ట్రూ లవర్”గా తెలుగులో అనువదించారు. ఈ చిత్రాన్ని తెలుగులో మాస్ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు మారుతి & ఎస్.కె.ఎన్ లు విడుదల చేశారు. మరి ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం..!!
కథ: తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న గొడవల కారణంగా ఎప్పుడూ చాలా చిరాగ్గా ఉంటాడు అరుణ్ (మణికందన్). తండ్రి మీద కోపం, తల్లి మీద ప్రేమ కంటే.. ప్రేమించిన దివ్య (శ్రీ గౌరి ప్రియ) మీద అనుమానం ఎక్కువ అరుణ్ కి. తను ఎక్కడికెళ్లినా తనకి చెప్పి వెళ్ళాలి అని ఆంక్షలు విధిస్తుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ కి ఫ్రీడం తానే ఇవ్వాలి అనుకునే కుంచిత స్వభావం గల అరుణ్ ని వీలైనంత వరకూ భరిస్తుంది దివ్య.
కానీ.. ఒకానొక పాయింట్ లో బరస్ట్ అయిపోయి, బ్రేకప్ చెప్పేస్తుంది. అరుణ్ తన మెంటల్ ప్రెజర్ & ఫ్యామిలీ ఇష్యూస్ లో ఈ బ్రేకప్ ను ఎలా తీసుకోగలిగాడు? చివరికి అరుణ్-దివ్యల ప్రేమ ప్రయాణం ఏ తీరానికి చేరుకుంది? అనేది “ట్రూ లవర్” కథాంశం.
నటీనటుల పనితీరు: మణికందన్ క్యారెక్టర్ కు యూత్ ఆడియన్స్ విశేషంగా కనెక్ట్ అవుతారు. అతడు ఆ పాత్రలో ఇమిడిపోయిన తీరు బాగుంది. అతడి కళ్ళల్లో కోపం, చిరాకు, అలసత్వం ప్రేక్షకులు కూడా అనుభవిస్తుంటారు. అయితే.. అతడు ఎందుకు అలా తయారయ్యాడు, అది కూడా తన తండ్రి కారణంగా తల్లి ఎంతగా బాధపడుతుందో చూసి కూడా అనేదానికి జస్టిఫికేషన్ ఇవ్వలేదు. అందువల్ల.. క్యారెక్టర్ చేసే పనులకి కనెక్ట్ అవుతారు కానీ, క్యారెక్టర్ కు ఎక్కువగా కనెక్ట్ అవ్వలేమ్.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన శ్రీ గౌరీప్రియ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెరపై ఒదిగిపోయింది. తన లవర్ పైత్యాన్ని సహిస్తూ, అతడి మంచి కోసం తాపత్రయపడే సగటు ప్రేమికురాలిగా ఆమె క్యారెక్టర్ కు అమ్మాయిలు బాగా రిలేట్ అవుతారు. ఇప్పటివరకూ వచ్చిన చాలా ప్రేమకథల్లో అమ్మాయిలదే తప్పు అనేట్లుగా చూపిన ప్రొజెక్షన్ కు విసిగిపోయిన అమ్మాయిలు ఈ చిత్రానికి ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సహాయ పాత్రల్లో కనబడిన నటీనటులందరూ ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: సియాన్ రోల్డాన్ సంగీతం ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. తెలుగులో సాహిత్యం సింక్ అవ్వడానికి కాస్త ఇబ్బందిపడినప్పటికీ, నేపధ్య సంగీతంతో మాత్రం మంచి మూడ్ సెట్ చేశాడు సియాన్. ముఖ్యంగా సముద్రపు అలల నడుమ గాలితోపాటుగా నిశ్శబ్ధాన్ని వినియోగించుకున్న తీరు బాగుంది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ వర్క్ ప్లెజంట్ గా ఉంది. గొప్ప ఫ్రేమింగ్స్ గట్రా లేకపోయినా, కథకు అవసరమైన డీసెంట్ వర్క్ మాత్రం ఉంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, డి.టి.ఎస్ మిక్సింగ్ విషయంలో నిర్మాతలు ఇంకాస్త ఖర్చు చేసి ఉంటే బాగుండేది.
దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ప్రస్తుత తరం యువకులు, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో బాగా ప్రొజెక్ట్ చేశాడు. టాక్సిక్ లవ్ రిలేషన్స్ లో తప్పు ఎవరిది అనేదానికంటే, ఎవరు ఎక్కువ బాధపడుతున్నారు అనే పాయింట్ ను బాగా హైలైట్ చేశాడు. అమ్మాయికి స్వేచ్ఛనిస్తున్నాను అని గర్వపడే మగజాతి ఆణిముత్యాలకు చెంపపెట్టులా ఉంటాయి కొన్ని సన్నివేశాలు. కాకపోతే.. మరీ బ్యాడ్ గా చూపించకుండా, చివర్లో హీరో బాగా సెటిల్ అయినట్లు చూపించి అబ్బాయిల ఈగోను కూడా సాటిస్ఫై చేశాడు.
అయితే.. తాను ఈసడించుకొనే తండ్రితోనే తనను తన ప్రేయసి కంపేర్ చేయడాన్ని హీరో తట్టుకోలేకపోవడం, మదర్ సెంటిమెంట్ ను డీల్ చేసిన విధానం మాత్రం ప్రశంసనీయం. అయితే.. సినిమాలో మైనస్ ఏమిటంటే, కథ-కథనం అనేది ఉండదు, కేవలం సందర్భాలు మాత్రమే ఉంటాయి. అందువల్ల సినిమాతో కానీ పాత్రలతో కానీ ప్రేక్షకులు ప్రయాణించలేరు. కేవలం సందర్భాలకు కనెక్ట్ అవుతారంతే. ఆ విషయంలో దర్శకరచయిత కాస్త ఆలోచించి ఉంటే సినిమా మరో స్థాయికి చేరుకొనేది.
విశ్లేషణ: “ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం” అనుకునేవారు నిన్నటితరం, “ప్రేమ ఎంత మధురం.. ప్రియుడు/ప్రియురాలితో చాలా కష్టం” అనుకుంటున్నారు ప్రస్తుత యువత. అటువంటి యూత్ ఆడియన్స్ & కాలేజ్ స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా “ట్రూ లవర్”. సియాల్ రోల్డాన్ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది.
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus