కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం “ఉంగరాల రాంబాబు”. “మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు” లాంటి క్లాసిక్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల మనసులు గెలిచిన క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి సునీల్-క్రాంతి మాధవ్ ల కాంబో ప్రేక్షకులను నవ్వించిందో లేక కష్టపెట్టిందో చూడాలి.
కథ : రాంబాబు అలియాస్ ఉంగరాల రాంబాబు (సునీల్) చాలా భయస్తుడు, మొదట తాతయ్య ప్రోద్భలంతో ఏదో ఒక విషయాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమస్యలను నెట్టుకొచ్చిన రాంబాబు, తాతయ్య మరణం అనంతరం బాదం బాబా (పోసాని కృష్ణమురళి)ని నమ్ముకొంటాడు. దొంగ బాబా అయిన పోసాని చెప్పిన మాటల్లో నిజం లేకపోయినా రాంబాబు అదృష్టం బాగుండి, అన్నీ కలిసొస్తాయి. అదే సమయంలో సావిత్రి (మియా) పరిచయమవుతుంది. మొదట్లో ఆమెను దురదృష్టంగా భావించిన రాంబాబు.. తర్వాత తన గురువు బాదంబాబా చెప్పినట్లుగా సావిత్రిని పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. కట్ చేస్తే.. తాను ఇష్టపడిన సావిత్రిని పెళ్లాడాలంటే ఆమె తండ్రి రంగనాయర్ (ప్రకాష్ రాజ్)ను కూడా ఒప్పించాలని తెలుసుకొని, అందుకోసం కేరళ వెళ్తాడు. అక్కడ ఉంగరాల రాంబాబు ఎదుర్కొన్న పరిస్థితులేమిటి? చివరికి తన ప్రేమను ఎలా గెలుచుకోగలిగాడు? అనేది సినిమా కాన్సెప్ట్.
నటీనటుల పనితీరు : ఉంగరాల రాంబాబుగా టైటిల్ పాత్రలో సునీల్ తన కామెడీ టైమింగ్ తో మెప్పించాలనే విఫలయత్నం ప్రేక్షకుల పాలిట మరణశాసనంలా మారింది. కొన్ని వందల సినిమాల్లో తన కామెడీతో నవ్వించిన సునీల్ ఈసారి మాత్రం కథ బాలేకో క్యారెక్టర్ అర్ధం కాకో ఏదో అలా డైలాగులు చెప్పుకుంటూ వెళ్లిపోయాడే తప్ప ఎక్కడా తనదైన శైలిలో నవ్వించడానికి ప్రయత్నించలేదు. మలయాళ కుట్టి మియా జార్జ్ అందంగా ఉంది కానీ.. కథలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం ఆమె మొహంలోనే కనిపిస్తుంటుంది. ఇక ప్రకాష్ రాజ్ రెగ్యులర్ రోల్ లో పర్వాలేదనిపించుకొన్నాడు. పోసాని, నల్ల వేణు, వెన్నెల కిషోర్ లాంటి రెగ్యులర్ కమెడియన్స్ నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు పూర్ ఎగ్జిక్యూషన్ వల్ల ఫలించలేదు.
సాంకేతికవర్గం పనితీరు : జిబ్రాన్ పాటలు మామూలుగానే సరిగా అర్ధం కావు, ఇక ఆ పాటలు సమయం-సందర్భం లేకుండా రావడంతో చిరాకు పెట్టిస్తాయి. సర్వేశ్ మురారి లాంటి టాప్ కెమెరామెన్ అవుట్ పుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, కానీ కథ-కథనాల్లో వైవిధ్యం మాత్రమే కాక కనీస స్థాయి ఎంటర్ టైన్మెంట్ లేకపోవడంతో.. ఆయన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. పాటలు, మాటలు, ఎడిటింగ్ గురించి మాట్లాడుకోడానికి ఏం లేదు. సినిమాల మొదలయినప్పటి నుంచి సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. “ఈ డైరెక్టరేనా “మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు” సినిమా తీసింది” అని. సెకండాఫ్ లో వచ్చే ఒకట్రెండు సన్నివేశాలు మినహా సినిమాలో ఎక్కడా క్రాంతి మాధవ్ మార్క్ అనేది కనిపించదు. ఆయన కెరీర్ లో ఇది ఒక బ్యాడ్ ఫిలిమ్ అని పేర్కొనడం తప్ప ఆయన మేకింగ్ స్టైల్ ను వేలెత్తిచూపలేం. కాకపోతే.. ఈ సినిమా స్టోరీ మినహా మరేదీ ఆయన నేతృత్వంలో జరగలేదని అర్ధమవుతుంది.
విశ్లేషణ : సునీల్ చాలా సరదాగా చిరాకుపెట్టించిన ఈ చిత్రం సునీల్ వీరాభిమానులు సైతం చూడలేరు. పాపం క్రాంతి మాధవ్ మాత్రం బలయ్యాడు. ప్రేక్షకులు మరి బలవుతారో, బయటపడతారో వారిష్టం.