యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. డైలాగ్ చెప్పినా, డాన్స్ చేసినా ఆయన గ్రేస్ వేరు. ‘సింహాద్రి’, ‘ఆది’, ‘యమదొంగ’ నుంచి మొన్నటి ‘ఆర్ఆర్ఆర్’ వరకు తారక్ నటన చూసి మనం ఫిదా అయిపోయాం. రాజమౌళి, వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్లు ఎన్టీఆర్‌ను పిండేసారని, ఆయనలోని నటుడిని పూర్తిగా వాడేశారని మనం భావిస్తుంటాం. కానీ అదంతా భ్రమేనట.. అసలు సినిమా ముందుందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ సంచలన కామెంట్స్ చేశారు.
రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా ఎన్టీఆర్ పొటెన్షియల్‌ను సరిగ్గా వాడుకోలేదని, ఆయనలో ఇంకా మనం చూడని కోణం చాలా ఉందని రవి బాంబ్ పేల్చారు. తారక్ స్టామినా ఏంటో, ఆయన రేంజ్ ఏంటో ప్రశాంత్ నీల్ తారక్ సినిమాతో చూపిస్తామని, బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జక్కన్న లాంటి డైరెక్టర్లే తారక్‌ను పీక్స్‌లో చూపించారని ఫ్యాన్స్ అనుకుంటుంటే, ఈ నిర్మాత ఇలా అనడం ఆసక్తికరంగా మారింది.
నిజానికి కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ చేసిన నటన, ఆ ఎమోషన్స్ చూసి ప్రపంచమే చప్పట్లు కొట్టింది. అంతకుమించి ఎన్టీఆర్‌ను చూపించడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ప్రశాంత్ నీల్ మీద మేకర్స్‌కు ఆ రేంజ్ నమ్మకం ఉంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాల్లో హీరోలను నీల్ ఎలివేట్ చేసిన తీరు చూస్తే, ఎన్టీఆర్ విషయంలో ఆయన ప్లానింగ్ ఊహకు అందడం లేదు. బహుశా ఇప్పటివరకు మనం చూడని వైల్డ్ అండ్ వయొలెంట్ అవతార్‌లో తారక్ కనిపించబోతున్నాడన్నమాట.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో సినిమాను చెక్కుతున్నాడు. రవిశంకర్ మాటలను బట్టి చూస్తుంటే, ఇందులో ఎన్టీఆర్ పాత్ర కేవలం మాస్ మసాలాగా మాత్రమే కాకుండా, నటనకు కూడా ఆస్కారం ఉన్న ఇంటెన్స్ రోల్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.
