రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ ‘వారణాసి’ (SSMB29) గురించి బయటకొచ్చే ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో నటించేది మరెవరో కాదు, సుధీర్ బాబు తనయుడు, కృష్ణ గారి మనవడు దర్శన్ అని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ (RFC)లో జరుగుతోందని ఇండస్ట్రీ టాక్.
దర్శన్ ఈ సినిమాలో భాగం అవుతున్నారనే వార్త ఘట్టమనేని అభిమానుల్లో కొత్త జోష్ నింపుతోంది. రాజమౌళి తన సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌కి, చిన్నప్పటి పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనకు తెలిసిందే. ‘బాహుబలి’లో చిన్నప్పటి మహేంద్ర బాహుబలిని చూపించినట్లు, ఇందులో మహేష్ పాత్ర బాల్యాన్ని చాలా ఎమోషనల్‌గా, పవర్ ఫుల్ గా డిజైన్ చేశారట. ఆ పాత్ర కోసం సొంత మేనల్లుడిని తీసుకోవడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది.

విశేషం ఏంటంటే.. దర్శన్ కేవలం మహేష్ సినిమాలోనే కాదు, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడట. అందులో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో దర్శన్ కనిపించబోతున్నాడని టాక్. అంటే ఒకేసారి ఇద్దరు పాన్ ఇండియా సూపర్ స్టార్ల చిన్నప్పటి పాత్రల్లో నటిస్తూ, గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి దర్శన్ రెడీ అయ్యాడన్నమాట.
సుధీర్ బాబు పిల్లలు ఇప్పటికే సోషల్ మీడియా వీడియోలతో, జిమ్నాస్టిక్స్ ఫీట్లతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. వారిలో చురుగ్గా ఉండే దర్శన్, ఇప్పుడు ఏకంగా జక్కన్న సినిమాతో వెండితెరపైకి రావడం నిజంగా విశేషం. తాత కృష్ణ గారి పోలికలతో, మహేష్ ఛాయలతో ఉండే దర్శన్ ఈ పాత్రలకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని మేకర్స్ భావిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
