తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే కుటుంబ కథా చిత్రాలకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. చాలా వరకు మన ఇండస్ట్రీలోనే ఎక్కువ ఫ్యామిలీ పిక్చర్స్ తెరకెక్కాయని చెప్పొచ్చు.. నట శేఖర, సూపర్ స్టార్ కృష్ణ కెరీర్‌లో ఇలాంటి సినిమాలు చాలనే ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం ప్రేక్షకాదరణ పొందాయి.. అలా రూపొంది, బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చిత్రం.. ‘ఇల్లు – ఇల్లాలు’..
సూపర్ స్టార్ కృష్ణ – రెబల్ స్టార్ కృష్ణంరాజుల క్రేజీ కాంబోలో వచ్చిన ఈ మల్టీస్టారర్.. 7 డిసెంబర్ 1972న విడుదలైంది.. 2022 డిసెంబర్ 7 నాటికి విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.. ఈ సందర్భంగా ‘ఇల్లు – ఇల్లాలు’ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం..
నటీనటులు – సాంకేతిక నిపుణులు..
ఈ చిత్రంలో కళాభినేత్రి వాణశ్రీ ద్విపాత్రాభినయం హైలెట్.. సూర్యకాంతం, రమా ప్రభ, రాజబాబు, గుమ్మడి, కాంతా రావు, నాగభూషణం తదితరులు నటించగా.. ఎన్. మాలతి దేవి కథ రాశారు. పి. చంద్ర శేఖర రెడ్డి స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేశారు. కె.వి. మహదేవన్ సంగీతమందించారు. ఆరుద్ర, సి. నారాయణ రెడ్డి, కొసరాజు, అప్పలా చార్య పాటలు, ఆరుద్ర, అప్పలా చార్య కలిసి మాటలు అందించారు. కె. సుఖ దేవ్ కెమెరా, ఎన్.ఎస్. ప్రకాశం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.. నందినీ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఎన్. సుబ్బా రాయుడు, జె.ఎ. రామ సుబ్బయ్య నిర్మించారు..
కుటుంబ కథాంశం..
ఇంటిల్లిపాది కలిసి చూడదగ్గ కథ, కథనాలతో తెరకెక్కించిన ‘ఇల్లు – ఇల్లాలు’ కృష్ణ, కృష్ణంరాజు, వాణిశ్రీ నటన ఆకట్టుకుంటుంది. రమా ప్రభ, రాజబాబుల కామెడీ ట్రాక్ అలరిస్తుంది.. కె.వి. మహదేవన్ పాటలు, నేపథ్య సంగీతం వినసొంపుగా ఉంటాయి.. మహిళా ప్రేక్షులు అందులోనే ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది..
సిల్వర్ జూబ్లీ జరుపుకుంది..
అశేష ప్రేక్షకాదరణతో విడుదలైన చాలా కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది.. అలాగే కొన్ని సెంటర్లలో సిల్వర్ జూబ్లీ (25 వారాలు) జరుపుకోవడం విశేషం.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన ‘ఇల్లు – ఇల్లాలు’ ఈ సినిమాకి పనిచేసిన వారందరి కెరీర్‌లో ఓ మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది..