‘భీమ్…. భీమ్లా నాయక్..’ అంటూ నిన్నటి నుండి ఓ పాట ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఆ పాట పవన్ కల్యాణ్‌ది అని, దానికి సంగీతం అందించింది తమన్ అని, పాడింది రామ్ మిరియాల, పృథ్వీచంద్ర, శ్రీకృష్ణ పాడారు. అయితే వీళ్ల కంటే ముందు…పాట మొదలు కాగానే ఒక పెద్దాయన కనిపిస్తారు. ఆయనే ప్రముఖ కిన్నెర గాయకుడు దర్శనం మొగిలియ్య. ఆయన చేతిలో ఉన్న 12 మెట్ల కిన్నెర. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన గురించే చర్చ. ఆయన గురించి చెప్పాలంటే… తెలంగాణ పాఠశాల్లో ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో నోట్‌బుక్‌లో ఆయన మీద ఒక పాఠమే ఉంది. అంతటి గొప్ప వ్యక్తి… ఈ పాటలో ఎందుకు కనిపించారు, ఎలా కనిపించారో చూద్దాం!
దర్శనం మొగిలయ్య… స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట. ఆయన తండ్రి ఎల్లయ్య. తండ్రి వారసత్వంగా వచ్చిన ఏడు మెట్ల కిన్నెరను పన్నెండు మెట్ల కిన్నెరగా మార్చి ప్రదర్శనలిస్తుంటారు మొగులయ్య. అంతరించిపోతున్న కిన్నెర వాద్యకళను కాపాడుతున్న మొగులయ్యను ఆ మధ్య తెలంగాణ ప్రభుత్వం గుర్తించి… ఉగాది పురస్కారంతో సత్కరించింది కూడా ఆ తర్వాత ఆయనపై ఎనిమిదో తరగతిలో పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టింది. అయితే కరోనా ఆయన జీవితంలో చీకట్లు నింపింది. ఈ పరిస్థితుల్లో ఊరూరా ప్రదర్శనలివ్వలేక… మొగులయ్య కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పత్రికలు, మీడియా ద్వారా తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆయన్ను ఒకసారి పిలిపించి మాట్లాడారట. ఆ తర్వాత ఈ సినిమాలో పాట పాడమని ఆహ్వానించారట.
అలా మొగులయ్య కొన్ని రోజుల క్రితం ఈ పాట పాడారు. తొలుత పాట చిత్రీకరణ కోసం చెన్నై దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఓ స్టూడియోలో రికార్డు చేశారట. ఇప్పుడు ఆ పాటే మనం విని ఉర్రూతలూగిపోతున్నారు. అయితే పాటలో, పాట విన్నవారి జీవితంలో ఉన్న ఉత్సాహం మొగులయ్యలో లేదు. కారణం ఆయన తిండి గింజల కోసం కూడా ఇబ్బంది పడుతుండటం. మరోవైపు తన కిన్నెర కళను తన బిడ్డలు కూడా తీసుకోలేదు. దీంతో తనతోనే ఈ కళ అంతరించిపోతుందేమో అని ఆయన బాధపడుతున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చిన ఓ 200 గజాలు స్థలం ఇస్తే… చిన్న ఇల్లు, ఆఫీసు కట్టుకొని.. ఓ పది కిన్నెరలు తయారు చేసి… తనకొచ్చిన విద్యను పది మందికి నేర్పుతానని అంటున్నారాయన. గతంలో ఓసారి మొగులయ్య ప్రతిభను, కళను గుర్తించి ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వం.. మరోసారి ముందుకొస్తుందని ఆశిద్దాం.