అక్కినేని నాగార్జున హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘వారసుడు’. ప్రముఖ నటుడు మురళీ మోహన్.. ‘శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్’ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ చిత్రంలో నాగార్జునకు తండ్రి పాత్రలో నటించడం తో మొదటి నుండీ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే…విడుదలకు ముందు ఇది ఓ భారీ మల్టీ స్టారర్ హైప్ ను సొంతం చేసుకుంది. 1993 వ సంవత్సరంలో మొదట మే 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించినప్పటికీ..
కొన్ని కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా అంటే మే 6న విడుదలయ్యింది. నేటితో ‘వారసుడు’ విడుదలై 28 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. కీరవాణి సంగీతం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది అని చెప్పాలి. నేపధ్య సంగీతం విషయంలో కూడా తన సత్తా చాటాడు కీరవాణి.మలయాళంలో రూపొందిన ‘పరంపర’ మరియు ‘పూల్ ఔర్ కాంటే’ ల సినిమాలకు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు మన ఇ.వి.వి గారు కొన్ని మార్పులు కూడా చేశారు. నగ్మా హీరోయిన్ కావడం సినిమాకి అదనపు ఆకర్షణ చేకూరిందని చెప్పాలి. ఇక మొదటి షోతోనే ‘వారసుడు’ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
అయితే ఈ చిత్రం వల్ల సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు బాగా హర్ట్ అయ్యారట. ఆయన ఈ సినిమాలో హీరోకి (నాగార్జునకి) తండ్రిగా ధర్మ తేజ అనే పాత్రలో నటించారు. అతన్ని అసహ్యించుకునే పాత్రలో నాగార్జున కనిపిస్తాడు. ఓ సీన్లో అయితే నాగార్జున.. కృష్ణ గారి కాలర్ పట్టుకుంటాడు. అలాగే క్లైమాక్స్ లో ధర్మతేజ(కృష్ణ) పాత్ర చనిపోతుంది. ఇలాంటి విషయాల పై సూపర్ స్టార్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసి నిరసనకు దిగారట. స్వయంగా కృష్ణ గారు రంగంలోకి దిగి.. ‘కథ ప్రకారమే ఆ పాత్రల తీరు అలా ఉంటాయి’ అని తన అభిమానులకు సర్దిచెప్పడంతో వారు శాంతించినట్లు తెలుస్తుంది.