మెగాస్టార్ 151 వ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ పైనే ఇప్పుడు అందరి చూపు ఉంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రాంచరణ్ నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కాబోతుంది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మొదటి నుండీ వివాదాలు వస్తూనే వున్నాయి. విడుదల సమయం దగ్గర పడుతుంటే ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకుల అడ్డుపడుతుండడం ‘సైరా’ టీం ను టెన్షన్ పెడుతుందట.
ఇటీవల ఉయ్యాలవాడ వంశానికి చెందిన కొందరు వ్యక్తులు జూబ్లీహిల్స్ లోని ‘కొణిదల ప్రొడక్షన్స్ కార్యాలయం’ బయట కూర్చొని నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు సమాచారం వెళ్ళడంతో.. వెంటనే వీరిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారు మీడియాతో మాట్లాడుతూ… “గత మేలో స్వామినాయుడు.. రాంచరణ్ పీఏ అవినాష్ తదితరులు మమ్మల్ని పిలిపించి రూ.5 కోట్లకు అగ్రిమెంట్ చేయించారు. నోటరి కూడా చేశారు. ఉయ్యాలవాడ వంశీకులైన 22 మందికి ఈ మొత్తాన్ని ఇస్తామని మాట ఇచ్చారు. కానీ.. ఇప్పటివరకూ వారు ఆ మాటను నిలబెట్టుకోలేదు.. న్యాయం చేయలేదు. గత నెలలో ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఏడు కుటుంబాలకు డబ్బులు ఇస్తామని చెప్పి కూడా న్యాయం చేయకపోవటంతో మేము రాంచరణ్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాం. ఇదిలా ఉంటే.. మాకు ఎలాంటి హక్కులు లేవంటూ రాంచరణ్ పీఏ అవినాష్ చెబుతున్నాడు. ఇలా మమ్మల్ని మోసం చేశారు. గతంలో చేసిన నోటరీని వీళ్ళు ఎలా మర్చిపోతారు” అంటూ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి..!