టాలీవుడ్‌లో నెపోటిజం గురించి మాట్లాడేవాళ్లు అందరూ గుర్తుంచుకోవాల్సిన పెద్ద విషయం ఒకటి ఉంది. అదే వారసుల తొలి సినిమాల టాక్ ‘ఓకే’ మాత్రమే. కొందరికైతే విజయాలు కూడా దక్కలేదు. ఆ తర్వాత కష్టపడి నెగ్గుకొచ్చారు. ఇప్పుడు స్టార్లుగా ఎదుగుతున్నారు. ఇదంతా ఎందుకూ అంటే.. తాజాగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారసుడు వైష్ణవ్ తేజ్ గురించి. ‘ఉప్పెన’తో వైష్ణవ్‌కు మంచి విజయమే దక్కింది. వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇక్కడే ఓ రికార్డు ముచ్చట బయటికొచ్చింది. అదే డెబ్యూ హీరో రికార్డు.
‘ఉప్పెన’ సినిమా విడుదలైన తొలి ఐదు రోజుల్లో ₹43 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. ఇక్కడే రికార్డు ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే బాలీవుడ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ డెబ్యూ ఇచ్చిన హృతిక్ రోషన్ రికార్డును వైష్ణవ్ అధిగమించాడు. హృతిక్ ‘కహోనా ప్యార్ హై’ తొలి ఐదు రోజుల్లో ₹42 కోట్లు వసూలు చేసింది. దీంతో కోటి రూపాయాలు ఎక్కువ వసూలు చేసిన వైష్ణవ్‌దే రికార్డు . అలా 21 ఏళ్ల కిందటి డెబ్యూ హీరోల రికార్డు వైష్ణవ్ ఖాతాలో చేరింది.
డెబ్యూ హీరోల రికార్డు గురించి మాట్లాడుకోవడం, వసూళ్లు కరెక్టే కావొచ్చు. అయితే అప్పటి వసూళ్లు, ఇప్పటి వసూళ్లను ఒకేలా చూడటం సరికాదేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 21 ఏళ్ల క్రితం నాటి టికెట్ రేట్లు, ఇప్పటి రేట్లు పోల్చుకుంటే ఆ ₹42 కోట్లు ఇప్పుడు ఎంత అవుతాయో అందరికీ తెలిసిందే. అలాంటిది ఆ వసూళ్లను, ఈ వసూళ్లను పోల్చడం ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.