పవన్ కల్యాణ్ సినిమాల్లో హీరో ఎంట్రీ సాంగ్స్‌లో ఓ మెసేజ్, పవన్ నైజం కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎలా ఆలోచిస్తారో ఆ పాటలు చూస్తే సులభంగా అర్థమైపోతుంది. పవన్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో వచ్చాక వస్తున్న సినిమా ‘వకీల్‌సాబ్’. మరి ఇందులో ఎలాంటి పాటలు ఉంటాయి అని అభిమానులు, జనసైనికులు ఎదురు చూస్తున్నారు. గతేడాది మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన తొలి పాటలో మహిళల గొప్పతనం వివరించేలా రూపొందించింది చిత్రబృందం. ఇప్పుడు రెండో పాట కూడా అదే సందర్భంలో వస్తుండటంతో.. ఈ పాట కూడా అలానే ఉంటుంది అనుకున్నారు.
‘సత్యమేవ జయతే…’ అంటూ సాగే ఓ పాటను ఈ రోజు విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ చూస్తే… ఈ పాట ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనిపించేలా ఉంది. ‘ఇలచెంపజారెడి ఆఖరి అశ్రువునా పెడివరకూ అనునిత్యం.. బలహీనులందరి ఉమ్మడి గొంతుగ పోరాటమె తన కర్తవ్యం’ అంటూ ఓ గ్లింప్స్‌ను షేర్ చేశారు రామజోగయ్య శాస్త్రి. ఆ వాక్యాలు చూస్తూ… పవన్ రాజకీయ ఆలోచలనకు దగ్గరకగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. వాక్యాలే ఇలా కనిపిస్తున్నాయి అంటే… మొత్తం పాట ఇంతకుమించి ఉంటుంది కదా అని నెటిజన్లు అనుకుంటున్నారు.
‘పింక్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. ఆ సినిమా నేపథ్యం బట్టి ఈ పాట సరిపోవచ్చు. కానీ పవన్ అంటే ఇప్పుడు కేవలం సినిమాలే కాదు కదా… రాజకీయాలు కూడా ఉన్నాయి. అందుకే రెండింటికీ ఉపయోగపడేలా పాటను సిద్ధం చేసి ఉండొచ్చు అనే మాటలూ వినిపిస్తున్నాయి. చూద్దాం పాట సాయంత్రమే వచ్చేస్తుంది కదా.