దర్శకసంచలనం రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం “వంగవీటి”. విజయవాడ రౌడీయిజం నేపధ్యంలో తెరకెక్కిన రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విజయవాడ రౌడీయిజం మరియు రాజకీయంలో కీలకపాత్రధారులైన వంగవీటి మోహనరంగ, వంగవీటి రాధ, దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ, దేవినేని మురళి మరియు చలసాని వెంకటరత్నంల జీవితాల ఆధారంగా తెరకెక్కించబడడం విశేషం. తాను ఇప్పటివరకూ తెరకెక్కించిన చిత్రాల్లో “ది బెస్ట్” అని చెప్పుకోవడంతోపాటు ఎన్నడూలేని స్థాయిలో ఈ చిత్రానికి ప్రబ్లిసిటీ కూడా చేసిన రాంగోపాల్ వర్మ “వంగవీటి”తో ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించాడో చూద్దాం..!!
కథ : “వంగవీటి” ప్యూర్ పోలిటికల్ డ్రామా. 1970, 1980ల మధ్యలో విజయవాడలో కమ్మ-కాపు వర్గాల నడుమ చోటు చేసుకొన్న చాలా అంశాలను చిత్ర కథాంశంగా ఎంచుకొన్నారు. విజయవాడలో రౌడీయిజానికి నాందిపలికిన వంగవీటి మోహనరంగ హత్య వెనుక అసలు కారణాలేంటి, ఆ తర్వాత రంగా తమ్ముడు వంగవీటి రాధ తెరపైకొచ్చి రాజకీయాన్ని రౌడీయిజంతో కలిపి ఏ విధంగా తన ఉనికిని చాటుకొన్నాడు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీయార్ వల్ల విజయవాడలో ఏర్పడిన రాజకీయ పరిణామాలేంటి వంటి విషయాలకు చాలా నిశితమైన పరిశీలనతో రాంగోపాల్ వర్మ చెప్పిన సమాధానాల సమాహారమే “వంగవీటి” చిత్రం.
నటీనటుల పనితీరు : కాకినాడ కుర్రాడు సందీప్ అలియాస్ సాండీ ఈ చిత్రంలో వంగవీటి రంగా, రాధగా చేసిన ద్విపాత్రాభినయం సినిమాకి మెయిన్ హైలైట్. కుటుంబ సభ్యుల గురించి తాపత్రయపడే ఇంటిపెద్దగా, తన వర్గం జనాల్ని ఆదరించే నాయకుడిగా అద్భుతంగా నటించాడు. కోపంతో రగిలిపోయే సన్నివేశాల్లో అతడి నటన ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది.
“హ్యాపీడేస్” ఫేమ్ వంశీ ఈ చిత్రంలో దేవినేని మురళీగా కంప్లీట్ డిఫరెంట్ రోల్ ను చాలా ఈజ్ తో ప్లే చేశాడు. అంతటి శౌర్యాన్ని ఈ కుర్రాడు ఎలా చూపించగలిగాడు అని ఎవరైనా ఆశ్చర్యపోకతప్పదు. వీళ్ళిద్దరు మాత్రమే కాదు చలసాని వెంకటరత్నం, దేవినేని నెహ్రూ, గాంధీల పాత్రలు పోషించిన పాత్రధారులు కూడా ఆ పాత్రకు వారు తప్పితే ఎవరూ న్యాయం చేయలేరు అన్నట్లుగా బాడీ లాంగ్వేజ్ మొదలుకొని స్టైలింగ్ వరకూ ప్రతి విషయంలోనూ ఒదిగిపోయారు. వంగవీటి రత్నకుమారిగా నటించిన నైనా గంగూలీ మాత్రం పాత్రకి మిస్ ఫిట్. అందంగా కనిపించడంపై చూపిన శ్రద్ధ, పాత్ర స్వభావాన్ని వ్యక్తీకరించడంలో చూపలేదు.
సాంకేతికవర్గం పనితీరు : రవిశంకర్ బాణీలు రెగ్యులర్ వర్మ సినిమాల్లో లాగానే ఉన్నాయి. అయితే.. డ్రమ్ బీట్స్ సీన్ లోని ఎమోషన్ ను బాగా హైలైట్ చేశాయి. ఇక కెమెరా విషయంలో వర్మ మళ్ళీ తన మార్క్ చూపాడు. టిపికల్ వర్మ ఫ్రేమ్స్, యాంగిల్స్ ఈ సినిమాలో చూడొచ్చు. గ్రే టింట్ ఎఫెక్ట్ బాగుంది. సింగిల్ షాట్ లో తీసిన యాక్షన్ సీక్వెన్స్ లు చాలా నేచరల్ గా ఉన్నాయి. సిద్దార్థ రాథోలు ఎడిటింగ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అయితే.. జర్క్స్ మరీ ఎక్కువగా ఉండడంతో ఆడియన్స్ కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాసాలూ ఎక్కువగానే ఉన్నాయి. దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి. 1970, 80ల నాటి విజయవాడను పూర్తి స్థాయిలో కాకపోయినా ఓ మోస్తరుగా రీక్రియేట్ చేయడంలో నిర్మాణ విలువల పాత్ర ఎంతైనా ఉంది.
సినిమా హిట్టైనా, ఫ్లాపైనా దర్శకుడిగా రాంగోపాల్ వర్మ క్రేజ్ ఎన్నడూ పడిపోలేదు. ఇక ఇతడి పని అయిపోయింది అని అందరూ అనుకొనే టైమ్ లో ఘనంగా తన ఉనికిని చాటుకోనేవాడు వర్మ. “రక్తచరిత్ర, వీరప్పన్” ఆ తరహా చిత్రాలే. ఇప్పుడు “వంగవీటి” కూడా ఆ జాబితాలో చేరింది. బెజవాడ రాజకీయాలను, రౌడీయిజాన్ని ఎంతో నేర్పుతో వర్మ తెరకెక్కించిన విధానం అద్భుతం. అసలు విజయవాడ రాజకీయ హత్యలు, కుతంత్రాలు తెలియనివారికి ఇదో డాక్యుమెంటరీలా ఉపయోగపడుతుంది. అయితే.. రియలిస్టిక్ గా ఉండాల్సిన ఈ సినిమాలో నాటకీయత మరీ ఎక్కువయ్యిందేమోననే అనుమానమూ రాక మానదు. అయితే.. దర్శకుడిగా తన మార్క్ ను ప్రతి సన్నివేశంలోనూ, ప్రతి ఎమోషన్ లోనూ చూపించాడు వర్మ. రెగ్యులర్ ఫ్యాక్షన్ సినిమాలా కాకుండా ఒక మోటివ్ తో జరిగే హత్యలు, గొడవలను వర్మ తెరకెక్కించిన తీరు చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
విశ్లేషణ : రాజకీయం, రౌడీయిజం అనేవి పదాల వరకే వేరైనా వ్యవహారశైలి ఇంచుమించుగా ఒకటే. రెండిటీ రూపకర్తలు ఒకరే. ఈ రౌడీయిజాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో బెజవాడ పోషించిన పాత్ర కీలకమైనది. వర్మ “వంగవీటి” చిత్రంలో చూపిన సన్నివేశాలు నిజం కాకపోవచ్చు, తెరకెక్కించిన ఎమోషన్స్ లో నిజాయితీ లేకపోవచ్చు కానీ.. “ఇలా జరిగిందా?” అనే అప్పటి గొడవలు తెలియనివారు చూడనివారు ముక్కున వేలేసుకొనే విధంగా వర్మ తెరకెక్కించిన “వంగవీటి”.