తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప సినిమా “శివ”. ఆ సినిమాతో తెలుగు సినిమా గమనం మారిపోయింది. ఇలా కూడా సినిమా తీయొచ్చా అని ఆలోచింపజేయడమే కాదు, ప్రేక్షకులు సినిమా చూసే విధానాన్ని కూడా మార్చేసింది. అలాంటి సినిమా దాదాపు 36 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతుండడం, అది కూడా రీమాస్టర్ వెర్షన్ అవ్వడం అనేది ప్రతి సినిమా అభిమానికి ఎనలేని సంతోషాన్నిచ్చింది.
ఈ రీమాస్టరింగ్ అనేది కొన్ని నెలలుగా జరుగుతుంది. కలరింగ్, సౌండ్ మిక్సింగ్ వంటివన్నీ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. అటువంటి “శివ” సినిమా ట్రైలర్ ను ఇవాళ విడుదల చేసేందుకు సన్నద్ధమైంది అన్నపూర్ణ సంస్థ. హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అయితే.. మొదట ఈవెంట్ ను పబ్లిక్ ఈవెంట్ లా చేద్దామని మీడియాని ఇన్వైట్ చేశారు. మరి సడన్ గా ఏమైందో తెలియదు కానీ.. పబ్లిక్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసి.. ప్రైవేట్ ఈవెంట్ గా మార్చేశారు. మీడియాను కాదని, ఆఖరికి లైవ్ కవరేజ్ కూడా ఇవ్వకుండా చాలా ప్రైవేట్ గా ఈవెంట్ ని నిర్వహించారు.

అందుకు కారణం ఏంటి అనేది తెలియదు కానీ.. ఈవెంట్ మొత్తాన్ని రికార్డ్ చేసి, అనంతరం ఫీడ్ ను మీడియాకి షేర్ చేయనున్నారు. సాధారణంగా తమిళనాట ఈ పద్ధతిని ఫాలో అవుతుంటారు. కాకపోతే.. అవి చాలా భారీ ఈవెంట్స్, అది కూడా శాటిలైట్ రైట్స్ అమ్మడం వల్ల అలా చేస్తుంటారు. కానీ.. ఈ ఈవెంట్ కి ఇలా చేస్తుండడం అనేది ఎందుకో అర్థం కావడం లేదు. దీని ద్వారా ఏదైనా కొత్త ఒరవడి తీసుకురావడానికా? లేక మీడియా నుండి ప్రశ్నలు ఎవాయిడ్ చేయడానికా? అనేది తెలియాల్సి ఉంది.
