వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు సినిమాలు తక్కువే చేసుండొచ్చు… అయితే చేసినవరకూ ఎక్కువ రోజులు గుర్తుండి పోయే పాత్రలే చేసింది. కథానాయిక కాకపోయినా కీలక పాత్రలే చేస్తూ వస్తోంది. మొన్న సంక్రాంతికి ‘క్రాక్’లో ‘జయమ్మ’గా వచ్చి ఎంతగా ఆకట్టుకుందో గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ పాత్రతోనే వస్తున్నా అని చెబుతోంది వరు శరత్ కుమార్. మీకు తెలుసుగా త్వరలో వరు ఈ నెల 19న ‘నాంది’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కోర్టు రూం సస్పెన్స్ డ్రామాతో ‘నాంది’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించాడు. అల్లరి నరేష్ ఓ హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఖైదీగా కనిపిస్తే… ఆ కేసు వాదించే ఆద్య అనే క్రిమినల్ లాయర్‌గా వరు శరత్ కుమార్ కనిపిస్తుంది. లాయర్ పాత్ర సవాలుతో కూడుకున్నది అని చెబుతోంది వరలక్ష్మి. లాయర్ కాబట్టి చాలా పెద్ద పెద్ద సంభాషణలు ఉంటాయి. అయితే వాటిలో కొన్ని నాలుగైదు పేజీలుండేవట. దీంతో రాత్రిళ్లు స్కూల్ పిల్లలా వాటన్నింటినీ బట్టీపట్టి షూట్‌లో పాల్గొనేదట. అంతేకాదు ఆమె మీద చాలా సీన్స్ చాలా సింగిల్ షాట్‌లో తీశారట.
ఇమేజ్ చట్రానికి తనను తాను పరిమితం చేసుకోవడం వరలక్ష్మికి నచ్చదట. సినిమా ఓకే చేసేటప్పుడు నటనకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటుదట. ఇప్పటివరకు వచ్చిన ఆమె సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది అనుకోండి. ఈ విషయంలో విజయ్ సేతుపతిని స్ఫూర్తిగా తీసుకుంటున్నా అని వరలక్ష్మి చాలా సార్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగులో సందీప్‌తో ఓ సినిమా చేస్తోంది. మరో రెండు సినిమా కథలు వింది. త్వరలో వాటి వివరాలు బయటికొస్తాయి. అన్నట్లు ఓ కథ బయోపిక్ అంట. ఏంటో ఆ సినిమా.