హీరోయిన్లు ఇల్లు మార్చడం అనేది కొత్త విషయమేమీ కాదు. గతంలో చాలామంది కథానాయికలు ఇలా తమది కాని ఊరులో ఇల్లు తీసుకొని మరీ సినిమాలు చేశారు. టాలీవుడ్ విషయానికొస్తే హైదరాబాద్‌లో ఉంటూ ఉంటారు. ఆ తర్వాత మెల్లగా సొంత ఇల్లు కొనుక్కునేవారు. ఆ వెంటనే హైదరాబాద్ మా రెండో హోం సిటీ అనేస్తుంటారు. ఇప్పుడు అదే మాట అనడానికి జయమ్మ ఉరఫ్ వరలక్ష్మి శరత్‌కుమార్ అనబోతోందా? అవుననే అనిపిస్తోంది ఆమె పనులు చూస్తుంటే.
టాలీవుడ్‌లో లేడీ విలన్ అంటే… ఇప్పుడు ఠక్కున గుర్తొచ్చే పేరు వరలక్ష్మి. రాయలసీమ యాసలో ఆమె పండించే విలనిజానికి టాలీవుడ్‌లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తమిళంలో కథానాయికగా చేసిన వరు శరత్‌కుమార్.. తెలుగులో మాత్రం విలన్‌గానే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. అలా అని ఒక్క అలాంటి రోల్స్‌కే పరిమితం అవ్వలేదు. అయితే ఆమె పాత్రల్లో గోపీచంద్ మలినేని జయమ్మ పాత్ర లెవలే వేరు. అసలు సిసలు లేడీ విలనిజం చూపించి అదరగొట్టింది. ‘క్రాక్’ సినిమాలో జయమ్మ అంటే… ఏంటో మీరు చూసే ఉంటారు.
ఆ సినిమా ప్రభావమో ఏమో కానీ… ఆ తర్వాత వరలక్ష్మికి తెలుగు సినిమాలు వస్తున్నాయి. తాజాగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న బాలకృష్ణ 107వ సినిమాలో కూడా ఆమెనే ఎంచుకున్నారు. ఈ సినిమాలో వరు… బాలయ్య చెల్లెలి పాత్రలో నటిస్తోందట. అయినా విలన్‌గానే అని సమాచారం. ఇది కాకుండా సమంత ‘యశోద’ సినిమాలో కూడా వరలక్ష్మి నటిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇలా వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో…
చెన్నై టు హైదరాబాద్ షటిల్ సర్వీసు ఎందుకు అనుకుందేమో… మకాన్ని హైదరాబాద్‌కి మార్చేసింది వరు. పుట్టి పెరిగిన చెన్నైని వీడుతున్నా… ఇక పై పూర్తి జీవితాన్ని హైదరాబాద్‌లోనే కొనసాగిస్తాను అంటూ వరలక్ష్మి ప్రకటించింది. ఈ మకాం మార్పు వెనుక సినిమా అవకాశాలే కారణమా… లేక ఇంకేమైనా ఉందా అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికైతే నగరంలోని ఖరీదైన ఏరియాలో ఒక ఫ్లాట్‌ను తీసుకుని వరు ఇక్కడ ఉంటోందట.