సినిమాలు – వాటి వసూళ్లు.. ఇదో పెద్ద టాపిక్. సినిమాలకు వచ్చిన టాక్, వస్తున్నాయంటున్న కలక్షన్లకు పొంతన కుదరక.. తలలు పట్టుకుంటున్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ థియేటర్ల దగ్గర సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌కి, బాక్సాఫీసు దగ్గర వస్తున్న డబ్బులకు.. ఫైనల్‌గా సినిమా నిర్మాతలు వేస్తున్న పోస్టర్లకు ఎలాంటి సంబంధం లేకుండా ఉంటోంది. ఇప్పు ఈ చర్చ అంతా ఎందుకు వచ్చింది అంటే.. సంక్రాంతి సినిమాలను చూసే. అందులోనూ ముఖ్యంగా ‘వారసుడు’ / ‘వరిసు’ను చూసే.
తమిళనాటు జనవరి 11న, తెలుగులో జనవరి 14న వచ్చిన విజయ్ – వంశీ పైడిపల్లి – దిల్ రాజు – రష్మిక మందనల ‘వరిసు’ / ‘వారసుడు’ సినిమా భారీ విజయం అందుకుందని, ఏకంగా రూ. 250 కోట్లు వసూలు చేసిందని చిత్రబృందం ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతోనే సమస్య మొదలైంది. ఎక్కడ కూడా సూపర్ హిట్ టాక్ అందుకోని ఈ సినిమాకు అంత వసూళ్లు ఎలా వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి అనేది తెలియడం లేదు అంటూ చర్చ మొదలైంది.
తమిళంలో అజిత్ ‘తునివు’ కంటే ‘వరిసు’కు పెద్ద బజ్ రాలేదు. విజయమూ రాలేదు అని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు నాట చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ కంటే ఎక్కువ వసూళ్లు ‘వారసుడు’కు వచ్చే అవకాశం లేదు. దీంతో రూ. 250 కోట్లు ఎలా సాధ్యం అనే ప్రశ్న వినిపిస్తోంది. ప్రచారం కోసం ఆ పోస్టర్ వేశారా? లేక నిజమేనా అంటూ సోషల్ మీడియాలో నిర్మాత దిల్ రాజును కొంతమంది అడుగుతున్నారు.
అయితే, ఈ రూ. 250 కోట్ల విషయంలో చిత్రబృందం మాత్రం స్పందించలేదు. అంత వసూళ్లు వస్తే ఆనందమే కానీ.. ఏదో పేరు కోసం పోస్టర్ వేస్తే ఉపయోగం ఏంటి అని అంటున్నారు. సరైన విజయం టాక్ అందుకోని సినిమాకు ఒకవేళ రూ. 250 కోట్లు వస్తే పెద్ద విషయమే . చూడాలి మరి రాజుగారు ఏమంటారో?