టాలీవుడ్ యాక్టింగ్ కపుల్ అని అంటుంటాం కానీ.. ఆ ఇద్దరూ కలసి నటించి 10 ఏళ్లు దాటిపోయింది. ఆ సినిమా తర్వాతే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కానీ.. ఇప్పటివరకు మళ్లీ కలసి నటించలేదు. ఈ కాంబినేషన్‌ను అప్పుడప్పుడూ టీవీల్లో చూసి మురిసిపోయిన అభిమానులు.. కలసి వెండితెరపై కనిపిస్తే బాగుండు అని కోరుకున్నారు. ఎట్టకేలకు వారి కోరిక నెరవేరుస్తూ ఓ సినిమాను ప్రకటించారు. ‘డియర్ ఆస్ట్రోనాట్’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.
Varun and Vithika
ఇందంతా చెప్పారు కానీ.. ఆ కపుల్ ఎవరో చెప్పలేదు కదా అంటారా? టీవీల్లో చూశారు, 10 ఏళ్ల క్రితం చూశారు అని హింట్స్ అందుకే. ఇక గెస్సింగ్ గేమ్ ఆపేసి.. ఆ కపుల్ వరుణ్ సందేశ్ – వితికా షేరు అని చెప్పేస్తున్నాం. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం ‘పడ్డానండీ ప్రేమలో మరి’ అనే సినిమాలో ఇద్దరూ కలసి నటించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక ఇప్పటివరకు మళ్లీ నటించలేదు. టీవీ షోల్లో కలసి కనిపించారు. ‘బిగ్‌బాస్’లో కూడా ఉన్నారు.
ఇప్పుడు లిప్ లాక్ పోస్టర్ రిలీజ్ చేసి తమ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. వితిక ఆస్ట్రోనాట్ డ్రెస్‌లో ఉండగా వరుణ్ ఆమెకు లిప్ కిస్ పెడుతూ కనిపించాడు. బ్యాక్ గ్రౌండ్‌లో రాకెట్ కూడా ఉంది. రాకెట్స్, అంతరిక్షం వంటి అంశాలతో ఓ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. మరి చాలాకాలం తర్వాత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ జోడీ ఎలా మెప్పిస్తుందో చూడాలి. వరుణ్ సందేశ్ అయితే ఇటీవల ‘నయనం’ అనే వెబ్‌సిరీస్‌తో రాణించాడు.
కార్తిక్ భాగ్యరాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు టీమ్ దాదాపు వరుణ్ – వితికాకు సన్నిహితులే అని సమాచారం. త్వరలో ఈ సినిమా పూర్తి వివరాలు వెల్లడిస్తారు అని సమాచారం. చూద్దాం మరి చాలా ఏళ్ల తర్వాత వీరు చేస్తున్న సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో?