సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ‘శ్రీమద్ రామాయణ్’ ‘వీర్ హనుమాన్’ వంటి మైథలాజికల్ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హిందీ చైల్డ్ ఆర్టిస్ట్ వీర్ శర్మ ప్రమాదవశాత్తు మరణించాడు. అతని వయసు కేవలం 10 ఏళ్ళు మాత్రమే కావడం అందరినీ విషాదంలోకి నెట్టే అంశం. రాజస్థాన్‌లో ఉన్న కోట అనంతపురలోని దీప్ శ్రీ భవనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 28న అంటే ఆదివారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో చైల్డ్ ఆర్టిస్ట్ వీర్ శర్మ తో పాటు అతని సహోదరుడు శౌర్య శర్మ కూడా ప్రాణాలు విడిచాడు. అతని వయసు 15 ఏళ్ళు కావడం గమనార్హం. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. వీర్, శౌర్య ఇద్దరూ పడుకుని ఉన్న గదిలో పొగ రావడంతో గాఢనిద్రలో ఉన్న వీర్, శౌర్య మేల్కోలేకపోయారు.
ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి పిల్లలను బయటకు తీసుకువచ్చారు.ఆ వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి వీరిని తరలించగా అప్పటికే వాళ్లిద్దరూ మరణించినట్టు తెలిపారట డాక్టర్లు. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయినట్లు తెలుస్తుంది. వీర్ శర్మ ‘వీర హనుమాన్’ సీరియల్ లో లక్ష్మణుడిగా కనిపించి పాపులర్ అయ్యాడు.
తర్వాత ‘శ్రీమద్ రామాయణ్’ సీరియల్ కూడా ఇతనికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న నెక్స్ట్ సినిమాలో కూడా ఆ పిల్లాడు నటిస్తున్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరగడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది.