సినిమాలు కేవలం వినోదానికి మాత్రమే కాదు.. వాటికి సమాజంపై ప్రభావం కూడా ఉంటుంది. ఒకప్పటి కథలు విలువలు కలిగి ఉండేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీల్లో కూడా విలన్లను హీరోలుగా చూపించడం నేటి ట్రెండ్ అయిందని కొందరు ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. విలన్లను హీరోలుగా చూపించడం హీరోయిజం కాదని, మంచి కథలు, విలువలతో కూడిన సినిమాలే ప్రేక్షకులకు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌లో జరిగిన నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ సభలో పాల్గొన్న వెంకయ్య నాయుడు, సినిమాల పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. “ప్రస్తుత సినిమాల్లో విలన్లను హీరోలుగా మార్చడం ఓ కొత్త ట్రెండ్ అయింది. కానీ అలాంటి పాత్రలు పిల్లలకు ఏమి నేర్పుతాయి? కథల విషయంలో నిర్మాణ సంస్థలు మంచి ప్రామాణికాలు పాటించాలి” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే, సినిమాలో అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు, ఘాటు సన్నివేశాలు అవసరం లేదని అన్నారు.
ఒకప్పటి సినిమాల పట్ల ఇప్పటికీ ప్రజలు గౌరవం చూపడం వాటిలో ఉన్న మంచితనమేనని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. పాతాళ భైరవి, మిస్సమ్మ, సీతారామయ్య గారి మనవరు లాంటి చిత్రాలు ఇప్పటికీ గుర్తుండిపోవడమే అందుకు ఉదాహరణ అన్నారు. ఈ తరంలో దర్శకులు, రచయితలు ఆత్మవిమర్శ చేసుకుని, కుటుంబమంతా కలిసి చూడగలిగే సినిమాలు చేయాలని సూచించారు. కృష్ణవేణి తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలు ఎనలేనివని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.
“ఆమె తీసిన మనదేశం సినిమాతో ఎన్టీఆర్ ను (Sr NTR) పరిచయం చేశారు. కీలు గుర్రం సినిమాతో ఏఎన్నార్ కు (ANR) స్టార్ స్టేటస్ అందించారు. ఇలాంటి గొప్ప మహిళలను ప్రేరణగా తీసుకోవాలి” అంటూ అభిప్రాయపడ్డారు. సినిమా ఒక బలమైన మీడియా. ప్రతి తరానికి దాని ప్రభావం ఉంటుందని వెంకయ్య నాయుడు మరోసారి గుర్తు చేశారు.