టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇతను 360 రోజుల్లో 300 రోజులు బిజీగానే గడుపుతాడు అని అంతా అంటుంటారు. కొత్త కమెడియన్లు ఎంత మంది వచ్చినా.. వారు ఎంత ఎదిగినా.. వెన్నెల కిషోర్ కి ఉండే డిమాండ్ వేరు. ఎందుకంటే కమెడియన్ గా మాత్రమే కాదు.. స్టార్ హీరోలకి ఫ్రెండ్ రోల్స్ కోసం కూడా ఎక్కువగా ఇతన్నే తీసుకుంటూ ఉంటారు. అది వెన్నెల కిషోర్ రేంజ్. ఇదిలా ఉండగా..
ఇటీవల వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ (Sreekakulam Sherlock Holmes) అనే సినిమా వచ్చింది. ఇందులో ఆల్మోస్ట్ వెన్నెల కిషోరే హీరో. అయితే ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లకి అతను హాజరు కాలేదు. క్యూ అండ్ ఏ.. వంటి వాటిల్లో ఈ విషయమై చిత్ర బృందాన్ని ప్రశ్నించగా వాళ్ళు ఏవేవో ఆన్సర్స్ ఇచ్చి కవర్ చేశారు. కానీ వెన్నెల కిషోర్ మాత్రం ఈ విషయంపై ఓపెన్ అయిపోయినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ హీరో అనే విషయం అతనికి తెలీదట. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ కోసం వెన్నెల కిషోర్ 10 రోజులు కాల్షీట్లు ఇచ్చాడట. దీని కోసం అతను అదనంగా ఎటువంటి పారితోషికం తీసుకోలేదట. అయితే రిలీజ్ టైంకి వెన్నెల కిషోర్ ని హీరోలా ప్రొజెక్ట్ చేసేసరికి అతను షాక్ అయ్యాడట. ఈ విషయమై నిర్మాతని ప్రశ్నించాడట వెన్నెల కిషోర్. అందుకే ప్రమోషన్స్ కి అతను హాజరు కాలేదు అని తెలుస్తుంది.
ఓకే..! వెన్నెల కిషోర్ ఆవేదనలో కొంత న్యాయం ఉంది. హీరో అని తెలిస్తే.. అతను ఇంకొంచెం శ్రద్దగా ఈ ప్రాజెక్టు చేసి ఉండొచ్చు. పారితోషికం కూడా ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు. అప్పుడు ప్రమోషన్స్ కి హాజరయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ నిర్మాతలు అలా చేయలేదు. ఇక్కడివరకు బాగానే ఉంది. మరి ఇదే ఏడాది.. మార్చి లో వెన్నెల కిషోర్ హీరోగా ‘చారి 111’ (Chaari 111) అనే సినిమా కూడా వచ్చింది. దాని ప్రమోషన్ కి కూడా వెన్నెల కిశోర్ హాజరు కాలేదు. మరి దాని సంగతేంటి?