సమాజంలోని సమస్యలను, వర్గ బేధాలను, వర్ణ విద్వేషాలను వేలెత్తి చూపుతూ చిత్రాలను తెరకెక్కించే వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం “విడుతలై”. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం తమిళనాట గతవారం విడుదలై.. అందరి ప్రశంసలు అందుకొంది. తమిళంలో ఘన విజయం సొంతం చేసుకున్నా ఈ చిత్రాన్ని “విడుదల” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు గీతా ఆర్ట్స్ సంస్థ.
కథ: పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని పోస్టింగ్లో జాయినవుతాడు కుమార్ (సూరి). అకాడెమీలో టాపర్ అయిన తనను కేవలం టిఫిన్ బాక్సుల డెలివరీ కోసం వాడడాన్ని అస్సలు ఇష్టపడడు. తనకు తెలియకుండానే గవర్నమెంట్ & పోలీసులు పట్టుకోవాలనుకుంటున్న ప్రజాదళం హెడ్ అయిన పెరుమాళ్ (విజయ్ సేతుపతి)కి సహాయపడి, గత 25 ఏళ్లలో అతడ్ని చూసిన ఏకైక వ్యక్తిగా నక్సలైట్ల కళ్ళల్లో పడతాడు కుమార్.
అక్కడ్నుంచి కుమార్ జర్నీ ఎలా సాగింది? ప్రజాదళం హెడ్ పెరుమాళ్ ను కుమార్ పట్టుకోగలిగాడా లేదా? అనేది “విడుదల పార్ట్ 1” (Vidudala) కథాంశం.
నటీనటుల పనితీరు: మొన్నటివరకూ కమెడియన్ గా చూసిన సూరిని.. మొదటిసారి సీరియస్ రోల్లో చూడడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. కానీ.. అతడి పాత్ర పరిచయమైన మొదటి 5 నిమిషాల్లోనే అతడు మునుపటి కమెడియన్ కాదని, అతడిలోని ఓ సరికొత్త కోణాన్ని మనం చూడడం మొదలుపెడతాం. అతడి కళ్ళల్లోని నిజాయితీ, బాడీ లాంగ్వేజ్ లో ఆశావాదాన్ని మాత్రమే చూస్తుంటాం.
పోలీస్ పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒదిగిపోయాడు. ఎన్నో పోలీస్ పాత్రలను డైరెక్ట్ చేసిన గౌతమ్ మీనన్, ఈ చిత్రంలో అదే తరహా పాత్ర పోషించడం విశేషం. అలాగే పావెల్ నవగీతన్, మున్నార్ రమేష్, చేతన్ ల పాత్రలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి.
సాంకేతిక వర్గం పనితీరు: ఇళయరాజా సంగీతం ఎందుకో ఈ చిత్రాన్ని పెద్దగా ఎలివేట్ చేయలేకపోయాయి. ఆయన సమకూర్చిన పాటలు, నేపధ్య సంగీతం కంటే.. సౌండ్ డిజైన్ ఈ చిత్రానికి బాగా హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా.. సూరి & విజయ్ సేతుపతిల నడుమ వచ్చే సన్నివేశాలను సైలెన్స్ తో ఎలివేట్ చేసిన తీరు బాగుంది.
ఆర్.వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అడవిలో చాలా కీలకమైన సన్నివేశాలను, తక్కువ లైటింగ్ తో, క్రేన్స్ సహాయం లేకుండా చిత్రించిన సన్నివేశాలు ఒక చక్కని అనుభూతినిస్తాయి. అదే విధంగా.. ఛేజింగ్ సీక్వెన్స్ లను కంపోజ్ చేసిన తీరు కూడా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ చాలా సహజంగా ఉంది. ఈ తరహా చిత్రాలకు కావాల్సిన అథెంటిసిటీని యాడ్ చేసింది.
దర్శకుడు వెట్రిమారన్ మార్క్ సన్నివేశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. పోలీసుల దౌర్జన్యం, ఆ కారణంగా సామాన్య ప్రజలు ఎదుర్కొనే కష్టాలు, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చేతులు దులుపుకోవడం చేసే పనులు ఎంత ఘోరంగా ఉంటాయో సినిమాగా చూపించడం అనేది ప్రశంసనీయం. అలాగే.. అడవుల్లో, గ్రామాల్లో నక్సలైట్లను, టెర్రరిస్టులను పట్టుకోవడం కోసం పోలీసులు అక్కడి ఆడవాళ్ళను ఏ విధంగా హింసిస్తుంటారు? అనే అంశాన్ని మెయిన్ పాయింట్ గా ఎలివేట్ చేసిన విధానం హర్షణీయం.
సినిమాల ద్వారా సామాజిక అంశాలను, సమాజంలో జరుగుతున్న ఘోరాలను, ప్రభుత్వం-పోలీసులు కలిపి చేసే అక్రమాలను చూపించడానికి బోలెడంత ధైర్యం కావాలి. ఆ ధైర్యంతోపాటు.. సమాధానం చెప్పగల సత్తా ఉన్న అతికొద్దిమంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకరు. “విడుదల”తోనూ ఆడేస్తాయి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు.
విశ్లేషణ: తమిళ దర్శకుడైనప్పటికీ.. తనదైన శైలి చిత్రాలతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు దర్శకుడు వెట్రిమారన్. ఆయన అభిమానుల్ని, రియలిస్టిక్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి తప్పకుండా నచ్చే సినిమా “విడుదల”. తెలుగు డబ్బింగ్ వర్క్ క్వాలిటీ కూడా బాగుండడం, లీడ్ క్యాస్ట్ దాదాపుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయస్తులే కావడంతో.. తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus