కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 70 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. అయితే విజయ్ తొమ్మిది సంవత్సరాల క్రితం లండన్ నుంచి రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేయగా ఆ కారుకు ఎంట్రీ ట్యాక్స్ ను చెల్లించలేదు. చెన్నై హైకోర్టు ఎంట్రీ ట్యాక్స్ విషయంలో విజయ్ రియల్ హీరోలా ప్రవర్తించాలని లక్ష రూపాయల జరిమానా విధించింది.
అయితే విజయ్ సన్నిహితులు మాత్రం లండన్ నుంచి కారును దిగుమతి చేసుకున్నందుకు విజయ్ భారీ మొత్తంలో దిగుమతి సుంకం చెల్లించారని గతంలో కోర్టు 20 శాతం ఎంట్రీ ట్యాక్స్ చెల్లించి వాహనం రిజిష్టర్ చేయించుకోమని చెప్పగా ఆ మొత్తాన్ని కూడా అప్పుడే చెల్లించామని చెబుతున్నారు. గతంలో ఒక కేసులో కోర్టు కస్టమ్స్ ట్యాక్స్ చెల్లించిన తర్వాత ఎంట్రీ ట్యాక్స్ వర్తించదని చెప్పిందని విజయ్ సన్నిహితులు వెల్లడిస్తున్నారు. తాజాగా విజయ్ న్యాయస్థానం చేసిన కఠినమైన వ్యాఖ్యలు సరికాదని హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.
మరో రెండు మూడు రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు రానుంది. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పు విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. డివిజన్ బెంచ్ లో అనుకూలంగా తీర్పు రాకపోతే మాత్రం విజయ్ ను నెటిజన్లు మరింత ట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. కారు విషయంలో విజయ్ ను ఇతర కోలీవుడ్ హీరోల ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.