విజయ్ దేవరకొండ బంగారుకొండ అని తెలంగాణవాసులు అభినందిస్తున్నారు. సినిమాల్లోనే కాదు నిజజీవితంలోను అతను హీరో అని ప్రశంసిస్తున్నారు. నటీనటులకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అనేది ఓ తీయని కల. ఆ అవార్డు అందుకోవాలని ఆశపడుతుంటారు. వచ్చిన అవార్డును చూసుకుంటూ మురిసిపోతుంటారు. కానీ విజయ్ దేవరకొండ రెండో చిత్రంతోనే ఈ అవార్డు కైవశం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి లో తన ప్రతిభకు వరించిన ఈ అవార్డు ను వేలం వేసి వచ్చిన డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తానని అప్పుడే చెప్పాడు. చెప్పిన్నట్టే చేసాడు.
కొన్నిరోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లోని జూబ్లీ 800లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా, ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ల్యాబరేటరీస్ అధినేత కిరణ్ దివి సతీమణి శకుంతల దివి 25 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా 25 లక్షల చెక్కును విజయ్ దేవరకొండకు అందించారు. శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి విజయ్ దేవరకొండ ఈ 25 లక్షల చెక్‌ను మంత్రి కేటీఆర్ కి అందచేశారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ వేదికపై చెప్పారు. అంతేకాదు ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ విధంగా విజయ్ దేవరకొండ ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచారు.