సినీ రంగంలో కష్టానికి తోడు అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో.. విజయ్ దేవరకొండ విజయాలను చూస్తే అర్ధమవుతాయి. ఒక్క ఛాన్స్ కోసం కాళ్లు అరిగేలా తిరిగిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా నిలబడ్డారు. ఈ మూవీ లాభాలను పంచి పెట్టింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించిన అర్జున్ రెడ్డి మూవీ సంచలన విజయం సాధించింది. 4 కోట్లతో నిర్మితమైన ఈ మూవీ 50 కోట్ల కలక్షన్స్ రాబట్టింది. ఆ చిత్రానికి విజయ్ కేవలం ఐదు లక్షలు మాత్రమే రెమ్యునరేషన్ అందుకున్నారు. సినిమా ఊహించని విజయం దక్కడంతో లాభాల్లో వాటా అందుకున్నారు. ఇక తాజాగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వారం రోజులు కూడా పూర్తికాకముందే 50 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ వంద కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది.
14 కోట్లతో నిర్మితమైన సినిమాకి విజయ్ 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారు. గీత గోవిందం సినిమాతో స్టార్ హీరో హోదా అందుకున్నారు. అందుకే అమాంతం రెమ్యునరేషన్ పెంచేసినట్టు తెలిసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నోటా అనే ద్వి భాషా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం మొదలయ్యేటప్పుడు 50 లక్షలకు ఒకే చెప్పిన విజయ్.. ఇప్పుడు మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అంతేకాదు భరత్ కమ్మ డైరెక్షన్‌లో “డియర్ కామ్రేడ్” అనే మూవీ కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది. దీన్నికూడా మూడు కోట్లే అందుకోబోతున్నారు. విజయ్ క్రేజ్ కి ఈ రెమ్యునరేషన్ తక్కువే అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.