ఇదివరకూ సినిమా పోస్టర్ లేదా ట్రైలర్ చూసి బాగుంటే ప్రేక్షకుడు సినిమాకి వచ్చేవాడు. కానీ.. ఇప్పుడు అందుబాటులో ఆన్ లైన్ ఎంటర్ టైన్మెంట్ కారణంగా ప్రేక్షకుడ్ని థియేటర్ కి రప్పించడం అంటే గుర్రాన్ని నది దగ్గరకి ఈడ్చుకొచ్చినంత కష్టమైపోయింది. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్స్ అనీ, ఇంటరాక్షన్స్ అనీ రకరకాల ఫీట్లు చేస్తే తప్ప జనాలు సినిమాలని చూడడం లేదు. ఈమధ్య ఆడియన్స్ కూడా సినిమా థియేటర్ కి మామూలుగా అయితే వెళ్ళడం లేదు. భారీ సినిమా అయితేనో లేక స్టార్ హీరో సినిమా అయితేనో మాత్రమే వెళుతున్నారు. అందుకే మీడియం లేదా చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతలు, హీరోలు కాంట్రవర్సీలను ప్రేక్షకుడ్ని ఎట్రాక్ట్ చేయడం కోసం వాడుతున్నారు.
“అర్జున్ రెడ్డి” సినిమానే అందుకు నిదర్శనం. సినిమా ట్రైలర్, పోస్టర్ కంటే కూడా హీరో ఆడియో విడుదల వేడుకలో వాడిన బూతు మాటకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ యాటిట్యూడే సినిమాకి భారీ ఓపెనింగ్స్ కి కారణం అయ్యింది. అందుకే విజయ్ దేవరకొండ తన తాజా చిత్రమైన “మహానటి” విషయంలోనూ సేమ్ ట్రీట్ మెంట్ ఫాలో అవుతున్నట్లున్నాడు. అందుకే.. సినిమా రిలీజ్ దగ్గరపడడంతో సావిత్రి ఫోటోను తన ట్విట్టర్ ఎకౌంట్ లో షేర్ చేస్తూ “చిక్” అని పేర్కొన్నాడు. మహానటి అయిన సావిత్రిని పట్టుకొని “చిక్” అని ఎలా అంటావ్రా అని విజయ్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వాళ్లందర్నీ “నేను చెన్నైలో ఉన్నాను సారీ కావాలంటే లీలా మహల్ కి రండి” అని పోస్ట్ చేశాడు. నిజానికి ఎవ్వరూ విజయ్ ని డైరెక్ట్ గా కలిసి సారీ ఎక్స్ ఫెక్ట్ చేయరు. మహా అయితే ఒక సెల్ఫీ తీసుకొంటారు. ఈ విషయం తెలిసి కావాలని ఇష్యూ చేసి, పబ్లిసిటీ రాబట్టుకోవడం కోసమే విజయ్ అలా చేశాడని కొందరు అంచనా వేస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ మనసులో ఏముందో తెలియదు కానీ.. మనోడి స్టంట్ మాత్రం సినిమాకి బాగానే పనికొచ్చింది.