కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసిన సినిమా అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించింది. వివాదాలను దాటుకుంటూ కలక్షన్ల వర్షం కురిపించింది. ప్రముఖ దర్శకులు వర్మ, రాజమౌళి కి నచ్చిన చిత్రంగా ప్రసంశలు అందుకుంది. తాజాగా ఐఎండీబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) వారు 2017 సంవత్సరంలో ప్రజలకు బాగా చేరువైన టాప్ 10 భారతీయ సినిమాల జాబితా ప్రకటించారు. ఇందులో రాజమౌళి తీర్చిదిద్దిన ‘బాహుబలి 2 ‘ రెండో స్థానంలో నిలవగా.. ‘అర్జున్ రెడ్డి’ సినిమా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.
స్టార్ హీరోల సినిమాలు సైతం పొందలేని ఈ స్థానాన్ని అర్జున్ రెడ్డి సొంతం చేసుకోవడంపై వైవిధ్యంగా విజయదేవరకొండ స్పందించారు. “భారతీయ సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ని మూడో స్థానంలో నిలబెట్టినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు దీన్ని బీట్ చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో..’ అని ట్వీట్ చేశారు. తన రికార్డును తానే బద్దలు కొడుతానని చెప్పారు. అయితే బాహుబలి కంటే మొదటి స్థానంలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా వచ్చిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేద’ నిలవడం విశేషం. అయితే ఇక్కడ టాప్ 10 జాబితాలో మొదటి మూడు స్థానాల్లో రెండు తెలుగు సినిమాలు నిలవడం తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల వారిని ఆనందింపజేసింది.