విజయ్ సినిమాలు చూస్తే… కాస్త అల్లరి వేషాలు ఎక్కువ వేస్తుంటాడు. అయితే అవసరమైనప్పుడు ఓ తరహా పెద్దరికమూ కనిపిస్తుంటుంది. ‘విజిల్’ సినిమాలో సీనియర్ విజయ్ పాత్రే దానికి ఉదాహరణ. చాలా నెమ్మదిగా, సెటిల్డ్‌గా ఉంటుంది. నిజ జీవితంలోనూ విజయ్ అలానే ఉంటాడనుకోండి. అయితే విజయ్ లైఫ్‌లో ఆ నెమ్మదితనం వెనుక మనసును మెలితిప్పే కష్టం ఉంది. బాధ ఉంది. మనోవేదన ఉంది. అందరిలాగే చెల్లెలు అంటే విజయ్‌కు ప్రాణం. చిన్నతనంలో చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకునేవాడో, అంతే ఆటపట్టించేవాడట.
అమాంతం కిటికీ నుండి గదిలో దూకి చెల్లెల్లి భయపెట్టి… తర్వాత బుజ్జగించే అల్లరి క్యారక్టర్ విజయ్‌ది అట. అలాంటి విజయ్ అనుకోని సంఘటనల వల్ల నెమ్మదించాడు. ఎంతగా అంటే వయసుకు మించిన నెమ్మదితనం వచ్చేసినంత. కారణం… అతని ముద్దుల చెల్లి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడమే. విజయ్ పది, పదకొండేళ్ల సమయంలో ఓ రోజు స్కూలు నుండి ఇంటికి వచ్చేసరికి… చెల్లి బెడ్ మీద అనారోగ్యంతో ఉంది. చూస్తూ ఉండగానే.. ‘నీ చెల్లెలు ఇక మనకు లేదురా’ అంటూ అతని తల్లి శోభ చెప్పారు.
దాంతో అల్లరి విజయ్ ఒక్కసారిగా ఎవరితోనూ మాట్లాడటం మానేశాడు. ఎవరైనా కదిపితే ఏడ్చేవాడట. ఆ బాధ నుండి వాడే బయటకొస్తాడులే అని అందరూ అనుకున్నారట. కానీ విజయ్ మనసు రాయిలా మారిందట. మునపటిలా మాట్లాడటం తగ్గించేశాడట. అల్లరిపిల్లాడు కాస్తా వయసుకి మించిన నెమ్మదితనం అలవర్చుకున్నాడట. అయితే చెల్లెలు చనిపోయిన తర్వాత ఏడాదికి విజయ్ నవ్వాడట. అది కూడా సినిమాలు చూసి. గతంలో విజయ్.. చిన్ననాటి విజయ్ కాంత్, రజనీకాంత్‌గా కనిపించి ఆ సమయంలోనేనట.