విజయ్ సేతుపతి (Vijay Sethupathi) , పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవల అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ గురించి సమాచారం బయటకు వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సరైన విజయం లేని దర్శకుడికి ఛాన్స్ ఎలా ఇస్తారు? అంటూ ఫ్యాన్స్ నేరుగా విజయ్ సేతుపతిని ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలు, కామెంట్ల గురించి తాజాగా విజయ్ సేతుపతి స్పందించాడు. విమర్శకులకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
పూరి జగన్నాథ్‌తో తాను చేయబోయే సినిమా చిత్రీకరణ జూన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు విజయ్ సేతుపతి. గతంలో చేసిన సినిమాల ఫలితాల ఆధారంగా తాను దర్శకులను జడ్జ్ చేయనని, తనకు చెప్పిన స్క్రిప్ట్ నచ్చితేనే ఆ సినిమా చేస్తానని విజయ్ సేతుపతి తెలిపారు. ఈలా పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చిందని, అందుకే అంగీకరించానని తేల్చేశారు. అంతేకాదు ఇలాంటి కథ ఇప్పటివరకూ తాను చేయలేదని కూడా చెప్పారు. గతంలో చేసిన స్టోరీలు రిపీట్ కాకుండా చూసుకుంటానని, ఇప్పుడూ అదే చేస్తున్నా అని చెప్పారాయన.
బలమైన సందేశం ఉన్న సినిమాలనే తాను ఎంచుకుంటానని, అదే తన బలమని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. పూర్తిగా వినోదాత్మక చిత్రాలలో నటించకూడదని ఎప్పుడూ అనుకోలేదని, కానీ వినోదంతో పాటు సందేశం కూడా ఉంటే బాగుంటుంది అని అలాంటి సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో కనిపించనుందనే విషయం తెలిసిందే. ఇటీవల సినిమా టీమ్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.
ఆ విషయంలో విజయ్ దగ్గర ప్రస్తావించగా.. టబు (Tabu) గొప్ప నటి, టాలెంటెడ్ కోస్టార్. గతంలో ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇప్పుడు ఆమెతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పాడు.మరి మీకు ‘సూపర్ డీలక్స్ (Super Deluxe), ‘ఉప్పెన’ (Uppena), ‘మహారాజ’ (Maharaja) సినిమాల్లో ఏ పాత్ర కష్టంగా అనిపించంది. ఇష్టంగా అనిపించింది అని అడిగితే.. లేటెస్ట్ మూవీ ‘మహారాజ’లో పాత్ర గురించి చెప్పారు. తాను నిజజీవితంలోనూ ఒక కుమార్తెకు తండ్రినే అని. అందుకే ఆ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యా అని చెప్పారాయన.