టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో విజయ్ సేతుపతికి మంచి పేరు ఉందనే సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తెలుగులో ఉప్పెన సినిమా ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు. అయితే ఒకప్పుడు విలన్ గా వరుస ఆఫర్లతో బిజీ అయిన విజయ్ సేతుపతి ఇప్పుడు మాత్రం విలన్ ఆఫర్లకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే నేను విలన్ రోల్ చేసినా ఆ పాత్రకు కొన్ని విలువలు ఉండాలంటూ విజయ్ సేతుపతి కామెంట్లు చేశారు.
వేగంగా 50 సినిమాలలో నటించిన విజయ్ సేతుపతి మహారాజ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విలన్ రోల్స్ చేసేందుకు ఇష్టపడని కొన్ని పనులున్నాయా అనే ప్రశ్నకు రియాక్ట్ అయ్యారు. విలన్ రోల్స్ కు అంగీకరించడం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వెల్లడించారు. జనాలకు ఎలాంటి కథనైనా చెప్పొచ్చు కానీ ఆ కథలో నైతికత ఉండాలని ఆయన పేర్కొన్నారు.
విలన్ పాత్రైనా సరే కొన్ని విలువలు ఉండాలని ఆ పాత్ర ఎవరి మనోభావాలను కించపరిచే విధంగా ఉండకూడదని విజయ్ సేతుపతి వెల్లడించారు. యాక్టర్లు, డైరెక్టర్లు భిన్నాభిప్రాయాలు, భావోద్వేగాలను కలిగి ఉంటారని ఆయన వెల్లడించారు. కానీ ఒక సినిమా చేసే సమయంలో అందరి కోసం తీయాల్సి ఉంటుందని విజయ్ సేతుపతి తెలిపారు. మనం జాగ్రత్తగా పని చేయాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కొన్నిసార్లు ఏది మంచో చెప్పడానికి కూడా చెడ్డ విషయాలను చూపించాల్సి ఉంటుందని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. ఇక్కడ కూడా కొన్ని నైతిక విలువలు ఉంటాయని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. ఎందుకంటే సినిమా జనాలను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. విజయ్ సేతుపతి చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ లో సైతం నిజం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.