దేశంలో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. ఎన్ని లాక్ డౌన్ లు పెట్టినా.. రోజుకి నమోదవుతున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ వైరల్ కారణంగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో కరోనా బాధితులను ఆదుకోవడం కోసం సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. అలానే పేదలకు అండగా నిలుస్తున్నారు. కోవిడ్ పై పోరాటం చేస్తున్న ప్రభుతాలకు తమ వంతు బాధ్యతగా ఆర్ధిక సాయం అందిస్తున్నారు సినీ తారలు.ఇప్పటికే చాలా మంది స్టార్స్ తమకు తోచిన సాయం అందించగా..
తాజాగా నటుడు విజయ్ సేతుపతి కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. కోవిడ్ పై పోరాటానికి తమిళనాడు ప్రభుత్వానికి రూ.25 లక్షలు అందజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి పాతిక లక్షల రూపాయల చెక్కుని అందించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలుసుకొని ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును సమర్పించాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళంతో పాటు తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవల ‘ఉప్పెన’ సినిమాలో కీలకపాత్ర పోషించిన ఆయన ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో ముఖ్య పాత్ర పోషించనున్నారని సమాచారం.