ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు విజయ్ సేతుపతి. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లో సినిమాలు ఒప్పుకుంటున్నారాయన. దీంతో ఆయన్ని కూడా పాన్ ఇండియా స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ తనకు ఆ ట్యాగ్ నచ్చదని చెబుతున్నారు విజయ్ సేతుపతి. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రాజ్ అండ్ డీకే హిందీలో రూపొందించిన ‘ఫర్జీ’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు విజయ్ సేతుపతి.
ఈ సిరీస్ కి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ లో యాంకర్.. విజయ్ సేతుపతిని ఉద్దేశిస్తూ.. పాన్ ఇండియా యాక్టర్ అని సంబోధించింది. అలా పిలవడంపై ఆయన స్పందించారు. ఆ ప్యాన్ ఇండియా ట్యాగ్ తో తను కంఫర్టబుల్ గా లేనని.. కొన్నిసార్లు అది మనపై ఒత్తిడిని కలిగిస్తుందని అన్నారు. తను కేవలం నటుడినని.. దానికి లేబుల్ వేయాల్సిన అవసరం లేదని అన్నారు. తను ప్రతి భాషలో సినిమా చేయాలనుకుంటున్నానని.. అవకాశం దొరికితే బెంగాలీ, గుజరాతీ భాషల్లో కూడా సినిమాలు చేస్తానని చెప్పుకొచ్చారు.
ఇదే విషయంపై నటి రాశిఖన్నా కూడా స్పందించింది. అందరం ముందు నటులమని.. తమలో ఎవరికీ కూడా పాన్ ఇండియా ట్యాగ్ నచ్చదని తెలిపింది. ఇది ఒకరంగా సెపరేట్ చేయడమే అవుతుందని చెప్పింది. ఇదివరకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని పిలిచేవారని.. ఆ తరువాత నార్త్, సౌత్ గా మారిందని.. ఇప్పుడేమో పాన్ ఇండియా అంటున్నారని తెలిపింది. ఈ విభజన అవసరం లేదని చెప్పుకొచ్చింది.
గతేడాది దుల్కర్ సల్మాన్ సైతం ‘పాన్ ఇండియా’ అనే పదం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఆ పదమంటే తనకు చికాకు అని.. వినడమే ఇష్టం లేదని చెప్పారు. ఇక ‘ఫర్జీ’ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి, రాశిఖన్నాలతో పాటు షాహిద్ కపూర్, రెజీనా, నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి తారలు కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 10 నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.