‘మజిలీ’ ‘ప్రతిరోజూ పండగే’ వంటి పలు హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ‘కలర్ ఫోటో’ తో హీరోగా కూడా ఎస్టాబ్లిష్ అయ్యాడు సుహాస్. మొన్నామధ్య వచ్చిన ‘హిట్ 2’ లో సైకో విలన్ గా కూడా చేసి కంప్లీట్ యాక్టర్ అనే బిరుదుకి కొంచెం దూరంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సుహాస్ హీరోగా నటించిన మరో చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ఈ మూవీ పై జనాల్లో కొద్దిపాటి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి సినిమా పరంగా ఆ అంచనాలను అందుకుందో లేదో ఓ లుక్కేద్దాం రండి :
కథ : పద్మభూషణ్ (సుహాస్) విజయవాడకు చెందిన ఓ కుర్రాడు.అక్కడ లైబ్రేరియన్ గా జాబ్ చేస్తుంటాడు. పద్మభూషణ్ తండ్రి(ఆశిష్ విద్యార్ధి), తల్లి సరస్వతి(రోహిణి) కొడుకు టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంటారు.ఎప్పటికైనా రైటర్ పద్మభూషణ్ గా మంచి స్థాయికి చేరుకోవాలని హీరోగారి ఆశ. ఈ క్రమంలో అప్పుచేసి మరీ ఓ పుస్తకాన్ని రాస్తాడు. అది సేల్ అవ్వక.. మరోపక్క ఇంట్లో చెప్పకుండా చేసిన అప్పుకి వడ్డీ కట్టలేక నానా పాట్లు పడుతుంటాడు పద్మభూషణ్. అయితే అతని ప్రమేయం లేకుండా పద్మభూషణ్ పేరుతో ఓ పుస్తకం, ఓ బ్లాగ్ వస్తాయి. వాటికి మంచి పేరు వస్తుంది. అనుకోకుండా ఫేమస్ అయిపోతాడు పద్మభూషణ్.
అతని పేరు ప్రఖ్యాతలు తెలుసుకుని ఎప్పుడో దూరమైన మేనమామ కూడా తన కూతురు సారిక (టీనా శిల్పారాజ్) ను ఇచ్చి పెళ్లి చేయడానికి వస్తాడు. అయితే ‘పద్మభూషణ్’ పేరుపై వచ్చే బ్లాగ్ లో పోస్టులు ఆగిపోతాయి. ఈ క్రమంలో పద్మభూషణ్ జీవితంలోకి అనుకోని పరిస్థితులు వచ్చి పడతాయి. వాటిని ఇతను ఎలా అధిగమించాడు? అసలు పద్మభూషణ్ పేరుతో ఆ బ్లాగ్ లు రాసేదెవరు? వంటివి మిగతా కథ.
నటీనటుల పనితీరు : సుహాస్ ఈ చిత్రంలో వన్ మెన్ షో చేసే ప్రయత్నం చేశాడు. అతని కామెడీ టైమింగ్ అందరినీ అలరిస్తుంది. ఈ చిత్రంలో అతను అదనంగా చేసింది ఏంటి అంటే సెంటిమెంట్ మరియు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా నటించడం. ఆ విధంగా కూడా ప్రేక్షకుల్ని మెప్పించాలని చూశాడు కానీ మనకు నాని యాక్టింగ్ చూసి ఇది ఇమిటేషనేమో అనే ఫీలింగ్ ను కలిగిస్తుంది.
రోహిణి, ఆశిష్ విద్యార్థి తల్లిదండ్రులుగా బాగానే నటించారు. హీరోయిన్ టీనా శిల్పారాజ్ మనకు షార్ట్ ఫిలింలో కనిపించే హీరోయిన్ పెర్ఫార్మన్స్ ఇచ్చి సరిపెట్టింది. అయినా పాస్ మార్కులు వేయించుకుంది. గౌరీ ప్రియా కూడా పర్వాలేదు అనిపించింది.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు షణ్ముక్ ప్రశాంత్ తాను అనుకున్న పాయింట్ కు మంచి కథనాన్ని అల్లుకున్నాడు.కామెడీ ట్రాక్ లు బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలను కూడా అతను బాగా డీల్ చేశాడు. ఆ రకంగా ఇతను పాస్ మార్కులు వేయించుకున్నాడు అని చెప్పాలి. పాటలు కూడా బాగున్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. నిర్మాణ విలువలు భారీ స్థాయిలో ఏమీ లేవు. కథకు, కథనానికి తగ్గట్టు యావరేజ్ గా ఉన్నాయి.
ప్రొడక్షన్ డిజైన్ కూడా అంతే..! ఎడిటింగ్ పరంగా అక్కడక్కడా కొన్ని అనవసరమైన సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయనిపిస్తుంది.
విశ్లేషణ : ‘రైటర్ పద్మభూషణ్’ ఓ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. కొన్ని బోరింగ్ సీన్స్ మినహా.. రన్ టైం కూడా 2 గంటల 3 నిమిషాలే కాబట్టి.. ఈ వీకెండ్ కు హ్యాపీగా ట్రై చేయొచ్చు.