ఇప్పుడంటే ఆన్‌లైన్ పరిచయాలు, ప్రేమల గురించి వింటున్నాం. అంటే గతంలో కూడా విన్నాం అనుకోండి. ఇటీవల కాలంలో మరీ ఎక్కువ వింటున్నాం. అయితే 18 ఏళ్ల క్రితం ఇలాంటి పరిచయమే ప్రేమగా మారి, పెళ్లి చేసుకున్నాడు మన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. అవును మేం చెప్పేది నిజం. విజయ్ సేతుపతిది ప్రేమ వివాహం అని మీకు తెలిసే ఉంటుంది. అయితే ఆ ప్రేమ కథ ఏంటి అనేది తెలియదా.. అయితే ఈ వార్త మీ కోసమే. విజయ్ సేతుపతి ఆన్‌లైన్ ప్రేమ, పెళ్లి ఇలా జరిగింది మరి.
విజయ్ సేతుపతి ఇప్పుడంటే స్టార్ యాక్టర్ కానీ, ఒకప్పుడు మనలాగే సాధారణ వ్యక్తే కదా. అతనికి కూడా వన్ సైడ్ లవ్‌లు ఉంటాయి. అలా కాలేజీలో చదువుకునేటప్పుడు ఓసారీ, ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మరోసారీ ప్రేమలో పడ్డారట. ముందు చెప్పుకున్నట్లు ఆ రెండూ వన్‌సైడ్ లవ్‌లే. అయితే ‘ఆర్య’లా అవేవీ సక్సెస్ కాలేదు. కానీ ఆ తర్వాత లైఫ్‌లో కాస్త సెటిల్ అయ్యాక ఓ ఆన్‌లైన్ పరిచయం ప్రేమగా మారింది. అదే పెళ్లిగా మారి, జీవితాన్ని ఇచ్చిందట.
ఇప్పుడంటే ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, టిండర్ అంటూ సోషల్ మీడియాలో చాలా రకాలు వచ్చాయి కానీ. 18 ఏళ్ల క్రితం ఉన్నవి ఆర్కుట్, యాహూ మెసెంజర్ లాంటివే కదా. అలా ఓ సారి విజయ్ సేతుపతికి ‘యాహూ మెసెంజర్’లో జెస్సీ అనే అమ్మాయి పరిచయం అయ్యిందట. ఆమె పరిచయమైన వారానికే ప్రపోజ్ చేసేశారట విజయ్ సేతుపతి. విచిత్రంగా ఆమె కూడా చెప్పిన వెంటనే ఓకే చెప్పేశారట. అక్కడికి ఐదు నెలలకు కేరళకి చెందిన జెస్సీ విజయ్ సేతుపతి భార్య అయ్యిందట. ఇక్కడో విచిత్రం ఏంటంటే… జెస్సీని విజయ్ సేతుపతి పెళ్లిలోనే తొలిసారి నేరుగా చూశారట.