మన సినిమాలు మన దేశంలో ఆడటం.. అమెరికాలో అడటం మనకు తెలిసిందే. ఈ మధ్య జపాన్, కొరియాలో కూడా మన పెద్ద సినిమాలు ఆడుతున్నాయి. అయితే చైనాలో భారీ విజయం అందుకున్న సినిమాలు అంటే మాత్రం మనకు ఠక్కున గుర్తొచ్చేది బాలీవుడ్ సినిమాలే. చైనా గడ్డ మీద అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమా లిస్ట్ చూస్తే టాప్ 9 బాలీవుడ్ సినిమాలే. పదోది మన ‘బాహుబలి 2’ (Baahubali 2). ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఓ తమిళ సినిమా వచ్చేలా ఉంది.
ఆ అవకాశం తమిళ సినిమాకు ఇస్తున్న వ్యక్తి విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అని చెప్పొచ్చు. ఆయన నుండి ఇటీవల వచ్చిన రూ. 100 కోట్ల సినిమా ‘మహారాజ’ (Maharaja) ఇప్పుడు చైనాలో విడుదలైంది. 40 వేలకు పైగా స్క్రీన్లలో ఈ సినిమా విడుదలై మొదటి రోజే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది అని చెబుతున్నారు. చైనాలో సుమారుగా 80 వేల స్క్రీన్లు ఉండగా, వాటిలో సగం పైగా ఒక తమిళ చిత్రం ఆడుతుండటం విశేషమే కదా.
మాండరిన్ సినిమాలకు రివ్యూలు ఇచ్చే డౌబన్ అనే వెబ్ సైట్ ‘మహారాజ’ సినిమాకు 8.7 రేటింగ్ ఇచ్చింది. ఇటీవల కాలంలో ఇంత ఎక్కువ రేటింగ్ వచ్చిన నాన్ చైనీస్ సినిమా ఇదే అంటున్నారు. సరిహద్దు వివాదం భారత్, చైనా మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో మన సినిమాలు అక్కడకు వెళ్లడం లేదు. ఇప్పుడు కాస్త ఓకే అవ్వడంతో ‘మహారాజ’ను అక్కడ రిలీజ్ చేసింది టీమ్.
హాలీవుడ్ సినిమా ‘గ్లాడియేటర్ 2’ నుండి పోటీ ఉన్నా.. ‘మహారాజ’ బలంగా తన ప్రభావం చూపిస్తోందని సమాచారం. ఫుల్ రన్‌లో ఈ సినిమాలో భారీ వసూళ్లు సంపాదించడం పక్కా అని అంటున్నారు. అదే జరిగితే టాప్ 10లోకి ఈ సినిమా కచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆదివారం నెంబర్లు పూర్తిగా వస్తే సినిమా పరిస్థితిని ఇంకా సులభంగా అంచనా వేయొచ్చు.