విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ‘మహారాజ’ (Maharaja) సినిమా గతేడాది సౌత్‌లో అదరగొట్టింది. చిన్న సినిమాగా, పెద్దగా ప్రచారం లేకుండా వచ్చిన ఆ చిత్రానికి భారీ ఆదరణ, వసూళ్లు దక్కాయి. ఇప్పుడు ఆ ఆదరణ విదేశాల్లో కూడా కనిపిస్తోంది. చైనాలో ఈ సినిమాను రీసెంట్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడ ‘మహారాజ’ దూకుడు చూస్తుంటే ఒకట్రెండు రోజుల్లో రూ. వంద కోట్లు పక్కా అనిపిస్తోంది. ఎందుకంట ఇంకా సాధించాల్సింది ఎనిమిదిన్నర కోట్ల రూపాయలే.
Maharaja
ఇప్పటివరకు చైనాలో టాప్ గ్రాసర్స్ సినిమాలు బాలీవుడ్ నుండే వచ్చాయి. ఆమిర్ ఖాన్ (Aamir Khan) ‘దంగల్’ రూ.1480 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత స్థానమూ ఆమిర్‌దే. ‘సీక్రెట్ సూపర్ స్టార్’కి రూ.840 కోట్లు వచ్చాయి. అలా చూస్తే టాప్ 10లో వరుసగా వాళ్ల సినిమాలే ఉంటాయి. అలాంటి లిస్ట్‌లోకి సౌత్ ఇండియన్ సినిమా ఒకటి వచ్చింది. అదే ‘మహారాజ’. రూ.92 కోట్లతో టాప్ 10లో నిలిచింది.
సినిమా ఇంకా థియేటర్లలోనే ఉండటంతో రూ. 100 కోట్లు పూర్తి కావడం, టాప్ 10 టేబుల్‌ను డిస్ట్రబ్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. ఆ విషయం పక్కన పెడితే ఇన్నాళ్లూ రూ.80 కోట్లతో సౌత్ నుండి టాప్‌లో ఉన్న ‘బాహుబలి 2’ (Baahubali 2) ఒక్కటే ఉండేది. ‘బాహుబలి 2’ అక్కడ ఫుల్ రన్‌లో రూ.80 కోట్లు మాత్రమే సాధించింది. దీంతో ‘బాహుబలి 2’ రికార్డు ఇప్పుడు బద్ధలైంది. ఈ క్రమంలో ఓ పరిశీలన కూడా చేయొచ్చు.
అదే చైనాలో కమర్షియల్ సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదు అని. ఎందుకంటే టాప్ 10 ఇండియన్ సినిమాల్లో భావోద్వేగాలు బలంగా ఉన్న సినిమాలే కనిపిస్తాయి. కాబట్టి అలాంటి మన సినిమాలు అక్కడ ఓ ట్రయల్ వేయొచ్చు. ఇక ‘మహారాజ’ సినిమా గురించి చూస్తే ఓ అమ్మాయి అఘాయిత్యానికి గురై బలైతే పెంచుకున్న తండ్రి తీర్చుకునే పగ, ప్రతీకారమే ఈ సినిమా. ఈ పాయింట్‌ను చూపించిన విధానం మన దగ్గరే కాదు, చైనా జనాలకూ బాగా నచ్చేసింది. అదే వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.