ఇప్పుడంటే విజయశాంతి అనే పేరు చెబితే ‘ఎవరా?’ అని గుర్తుతెచ్చుకోవడానికి చాలామంది తడబడుతున్నారు కానీ 90ల కాలంలో అందరి హాట్ ఫేవరెట్ హీరోయిన్ విజయశాంతి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోల అందరి సరసన నటించడమే కాక తెలుగులో సీనియర్ నటీమణి భానుమతి తర్వాత ఆ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకొన్నది విజయశాంతి మాత్రమే. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాలతో కూడా సూపర్ హిట్లు కొట్టి తన స్టామినాను పలుమార్లు ప్రూవ్ చేసుకొంది. ఒకానొక దశలో విజయశాంతినే హీరోగా పెట్టి సినిమా తీసేందుకు స్టార్ డైరెక్టర్లు కూడా క్యూ కట్టారు. అలాంటి విజయశాంతి తదనంతరకాలంలో క్రేజ్ కోల్పోయి, సినిమాలకు దూరమై సైలెంట్ గా రాజకీయాల్లోకి వెళ్లిపోయింది. తొలుత “రాములమ్మ”గా తనకు తెలంగాణాలో ఉన్న స్టార్ ఇమేజ్ ను బేస్ చేసుకొని “టి.ఆర్.ఎస్”లో జాయిన్ అయిన విజయశాంతి ఆ పార్టీలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుమార్తె కవితకు ఉన్న ప్రాముఖ్యలతో సగం కూడా తనకు లభించకపోవడం, ఆ పార్టీలో కొనసాగడం తన రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా ఉంటుందని భావించడంతో ఆమె టీ.ఆర్.ఎస్ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యింది.
మరో రెండేళ్లలో ఎలెక్షన్స్ వస్తుండడంతో.. అసలే భారతదేశం వ్యాప్తంగా చాలా వీక్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా తెలంగాణాలో తమ పార్టీని ప్రభావితం చేసేందుకు నడుం కట్టింది. ఇటీవలే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడంతో.. తెలంగాణాలో విజయశాంతి-రేవంత్ రెడ్డిలను ఫ్రంట్ ఫేస్ గా పెట్టుకొని ప్రచారం మొదలెట్టానున్నారు. ఇందుకోసం తెలంగాణాలో ముఖ్యమైన మహిళా పొలిటీషియన్ గా విజయశాంతిని ఎంపిక చేయనున్నారు. ఆమెను కోర్ పార్టీలోనూ తీసుకొనున్నారని వినికిడి. ఎలక్షన్స్ లో విజయశాంతి వల్ల పార్టీ గెలుస్తుందా లేదా అనే విషయం పక్కనపెడితే.. ఈ తాజా సమీకరణల పుణ్యమా అని రాములమ్మ మళ్ళీ లైమ్ లైట్ లోకి రావడం ఖాయం.