తొలి సినిమా నాటికి పవన్ కల్యాణ్ అంటే చిరంజీవి తమ్ముడు అని అన్నారు. ఒక రెండు సినిమాలు అయిన తర్వాత సొంత గుర్తింపు రావడం మొదలైంది. పవన్ కల్యాణ్ అనే కొత్త హీరో ఇండస్ట్రీలో అదరగొడుతున్నాడు అనే పేరు తెచ్చుకున్నారు. ప్రేక్షకులు పవన్‌ను సోలోగా గుర్తించడం మొదలుపెట్టారు. అలాంటి రోజుల్లో పవన్‌ను చూసి ఓ స్టార్ రైటర్ అస్సలు గుర్తు పట్టలేకపోయారట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. అతను ఎవరో కాదు ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్.
విజయేంద్రప్రసాద్ 2000వ సంవత్సరంలో చెన్నై నుండి హైదరాబాద్‌కి మకాం మార్చేసిన రోజులవి. ఆ సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ల ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తే అక్కడికెళ్లారట విజయేంద్ర ప్రసాద్. అదే కార్యక్రమానికి పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారట. అప్పుడు విజయేంద్ర ప్రసాద్ స్నేహితుడు ఒకరు ఇదిగో ఇతనే పవన్ కల్యాణ్ అని విజయేంద్ర ప్రసాద్‌కు పరిచయం చేశారట. అప్పుడు విజయేంద్రప్రసాద్… పవన్‌ను చూసి తాను ఎవరితను అని అడిగారట.
ఆ విషయాన్ని విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పవన్ లాంటి స్టార్ హీరోను ఆ రోజుల్లో తాను గుర్తుపట్టకపోవడం తనకే ఇబ్బందిగా ఉందని చెప్పారు విజయేంద్రప్రసాద్. పవన్ అప్పటికే మంచి గుర్తింపు సంపాదించాడు కూడా అని చెప్పారు విజయేంద్రప్రసాద్. అయితే పవన్ అంటే తనకు సినిమా పరంగానే కాక వ్యక్తిగతంగానూ చాలా ఇష్టమని చెప్పారు విజయేంద్రప్రసాద్. తెలుగులో అతణ్ని మ్యాచ్ చేసే స్టార్ లేడని కూడా మెచ్చుకున్నారు.
పవన్ కల్యాణ్‌తో కలసి పని చేయాలని తనకూ ఉందని, కానీ పవన్ డేట్లతో ఇప్పటిదాకా ఏ నిర్మాతా వచ్చి సినిమా చేయమని అడగలేదని చెప్పారాయన. ఎప్పటికైనా పవన్ సినిమాకు కథ అందించాలని అనుకుంటున్నాను అని చెప్పారు విజయేంద్రప్రసాద్. ఆయన కథ అందిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ‘బాహుబలి’, ‘బజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘సీత’… ఇలా అన్నీ దుమ్మురేపే సినిమాలే. కాబట్టి పవన్‌తో సినిమా అంటే వీటికి మించే కథే ఉంటుంది.