మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన 1987 క్లాసిక్ హిట్ పసివాడి ప్రాణం ఓ తరాన్ని ఎమోషనల్‌గా కట్టిపడేసిన చిత్రంగా గుర్తింపు పొందింది. వినకుండా, మాట్లాడకుండా పుట్టిన చిన్నారిని రక్షించేందుకు ఓ సాధారణ వ్యక్తి చేసే పోరాటం ఆధారంగా నడిచిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అలాగే, ఆ సినిమాకు స్పూర్తిగా బాలీవుడ్‌లో రూపొందిన బజరంగి భాయిజాన్ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో బజరంగి భాయిజాన్ ఓ బిగ్ రికార్డ్ చిత్రంగా నిలిచింది.
కశ్మీర్ నేపథ్యంలో ఓ చిన్నారిని పాకిస్తాన్ లోని తన ఇంటికి చేర్చేందుకు ప్రయాణించే మానవతా కథగా ఆ సినిమా రూపొందింది. ఇక ఈ చిత్రానికి కథను అందించినవారే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad). అప్పట్లో ఆయన ఓపెన్‌గా పసివాడి ప్రాణం కథకు ఇన్‌స్పిరేషన్ తీసుకున్నానని ప్రకటించడం మరువలేం. ఇప్పుడు బాలీవుడ్ టాక్ ప్రకారం, సల్మాన్ ఖాన్ (Salman Khan) మళ్లీ ఆ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట.
ఇటీవల ఆయన సినిమాలకు మిశ్రమ స్పందన వస్తుండడంతో, తన కెరీర్‌ను తిరిగి రీబూట్ చేసేందుకు మళ్లీ బలమైన ఎమోషన్ ఉన్న కథను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో బజరంగి భాయిజాన్ 2కి పచ్చజెండా ఊపారని, విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ సీక్వెల్‌కు మరోసారి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. కొత్త చిన్నారి పాత్ర, కొత్త దేశస్థితి నేపథ్యంలో కథను అల్లే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.
ఈసారి చిన్నారి నేపథ్యాన్ని మరింత మానవీయ కోణంలో చూపించాలనే ఆలోచన కూడా ఉందని సమాచారం. మొత్తంగా చూస్తే, పసివాడి ప్రాణం స్ఫూర్తితో మరోసారి ఓ అద్భుతమైన ఎమోషనల్ డ్రామా తెరపైకి రానుందని నిపుణులు భావిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ పెన్ నుంచి మరోసారి మనసుల్ని తాకే కథ రావడంపై ఆశలు పెరిగిపోతున్నాయి. మరి భాయిజాన్ 2గా సీక్వెల్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.