కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘లవ్ స్టోరీ’, ‘టక్ జగదీష్’ లాంటి సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా రానా నటించిన ‘విరాటపర్వం’ సినిమా కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్శకనిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసుల సంఖ్య పెరిగిపోతుందని.. ఈ క్రమంలో ఏప్రిల్ 30న రావాల్సిన ‘విరాటపర్వం’ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని..
అప్పటివరకు మాస్క్ లు ధరించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ఒక్కటే కారణం కాదు.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లను పెంచి అమ్మకూడదనే జీవోను ఇటీవలే జారీ చేశారు. దీని కారణంగా ‘వకీల్ సాబ్’ లాంటి సినిమాపై కూడా ఎఫెక్ట్ పడుతోంది. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లకు టికెట్లు అమ్మితే డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు గిట్టుబాటు కాదు. తక్కువ రేట్లకు టికెట్లు అమ్మి.. థియేటర్లను నడిపించలేక యజమానులు థియేటర్లను మూసేస్తున్నారు.
ఈ పరిస్థితులు చక్కబడే వరకు సినిమాలను రిలీజ్ చేయకూడదనే నిర్ణయంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. టికెట్ రేట్లకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మీటింగ్ నిర్వహించాలని ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించుకున్నారు. త్వరలోనే చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్ లాంటి పెద్దలు జగన్ ని మీట్ అవ్వనున్నారు. ఈ మీటింగ్ తరువాత పరిస్థితి అదుపులోకి వస్తుందేమో చూడాలి. అప్పటివరకు థియేటర్లో కొత్త సినిమా చూసే ఛాన్స్ ఉండదు!