కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న అభిమానులతో పాటు సెలబ్రిటీలు, రాజకీయనాయకులు దిగ్బ్రాంతికి గురయ్యారు. పునీత్ లాంటి మంచి మనిషిని కోల్పోయినందుకు ఇండస్ట్రీ కన్నీళ్లు పెట్టుకుంది. కన్నడ ఇండస్ట్రీతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన సెలబ్రిటీలు పునీల్ కి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి లాంటి అగ్ర హీరోలు పునీత్ ను చివరిసారిగా చూసుకోవాలని బెంగుళూరుకి వెళ్లారు.
హీరోగా సినిమాలు చేయడమే కాకుండా.. తన బాధ్యతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు పునీత్. పదుల సంఖ్యలో ఫ్రీ స్కూల్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు 1800 మంది స్టూడెంట్స్ ను ఉచితంగా చదివిస్తున్నారు. అంతేకాదు.. అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేసి దిక్కులేని చాలా మందికి తనే దిక్కయ్యారు. అలాంటి వ్యక్తి కన్నుమూయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే పునీత్ చేపట్టిన సోషల్ సర్వీస్ ను కంటిన్యూ అయ్యేలా చూసుకుంటానని చెప్పారు హీరో విశాల్.
విశాల్-ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎనిమీ’ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పునీత్ ను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు విశాల్. ‘పునీత్ రాజ్ కుమార్ ఈజ్ నో మోర్’ అని చదివేప్పుడు, వినేప్పుడు జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తను కలిసిన అద్భుతమైన వ్యక్తుల్లో పునీత్ ఒకరని.. ఆయన లాంటి మనిషిని ఇండస్ట్రీలో చూడలేదని అన్నారు.
గవర్నమెంట్ చేసే పనిని ఆయన ఒక్కరే చేశారని.. 1800 మంది పిల్లలను చదివిస్తున్నారని అన్నారు. చనిపోయినప్పుడు కూడా తన కళ్లను దానం చేశారని ఎమోషనల్ గా చెప్పారు. ఆ తరువాత పునీత్ ని ఉద్దేశిస్తూ.. ‘నీ మిత్రుడిగా.. వీలైనంత వరకు నువ్వు చేసిన సర్వీస్ ను కంటిన్యూ అయ్యేలా చూసుకుంటాను. వచ్చే ఏడాది నుంచి ఆ 1800 మంది పిల్లల చదువుని నేను నడిపిస్తాను’ అంటూ మాటిచ్చారు.