మాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ.. “ఇంద్రుడు, జయసూర్య, కథకళి” వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ-నిర్మిస్తూ వరుస విజయాలు దక్కించుకొన్నాడు. మరోమారు తనకున్న మాస్ ఇమేజ్ ను బేస్ చేసుకొని.. విశాల్ టైటిల్ పాత్రలో నటించి-నిర్మించిన చిత్రం “రాయుడు”. ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా ఎంటర్ టైనర్ లో విశాల్ సరసన తెలుగమ్మాయి శ్రీదివ్య కథానాయకిగా నటించింది.
ఈ శుక్రవారం మన ముందుకు వచ్చిన “రాయుడు” ఏమేరకు ఆకట్టుకొన్నాడు? అసలు “రాయుడు” కథేంటో చూద్దాం..!!
కథ : రాయుడు (విశాల్) ఓ మార్కెట్ కూలీ. చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో.. తన అమ్మమ మంగమ్మ (లీలా) దగ్గర పెరుగుతాడు. మనిషి మొరటోడైనప్పటికీ.. అమ్మమ్మ పెంపకం కారణంగా ఆడవాళ్ళంటే అమితమైన గౌరమ్, పెద్దలంటే అభిమానం మాత్రం అబ్బుతాయి.
భాగ్యలక్ష్మి (శ్రీదివ్య) అదే మార్కెట్ పరిధిలో నివాసం ఉంటుంది. అదే ఏరియా కౌన్సిలర్ అయిన రోలెక్స్ బాచి (ఆర్.కె.సురేష్) కారణంగా తన తల్లి హత్యకు కాబడింది అని తన తండ్రితో కలిసి కోర్టులో కేసు వేస్తుంది.
తనకు వ్యతిరేకంగా కేసు వేశారన్న కోపంతో.. భాగ్యలక్ష్మి కుటుంబాన్ని అంతమోందించాలనుకొంటారు రోలెక్స్ అండ్ గ్యాంగ్. రోలెక్స్ బాచి నుంచి భాగ్యలక్ష్మిని కాపాడతాడు రాయుడు.
ఆ తర్వాత రాయుడు ఎదుర్కొన్నా సమస్యలేమిటి? వీరిద్దరి మధ్య రేగిన పంతంలో చివరికి గెలుపు ఎవరిది అనేది సినిమా కథాంశం..!!
నటీనటుల పనితీరు : రాయుడు అనే రోజు కూలీ పాత్రలో విశాల్ ఆహార్యం మొదలుకొని మేనరిజమ్స్ వరకూ అద్భుతంగా పండించాడు. ముఖ్యంగా.. లుంగీ మడతపెట్టి కట్టే సీన్స్ లో విశాల్ పలికించే హావభావాలు మాస్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చుతాయి.
భాగ్యలక్ష్మి పాత్రలో శ్రీదివ్య ధీరవనితగా చక్కగా నటించినప్పటికీ.. చాలా కీలక సన్నివేశాల్లో నీరసంగా కనిపిస్తుంది. రోలెక్స్ బాచిగా నటించిన “ఆర్.కె.సురేష్” విలనిజాన్ని పండించిన తీరు అభినందనీయం. ఒక కరడుగట్టిన హంతకుడిగా అతడు పలికించిన హావభావాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి.
విశాల్ కు అమ్మమ్మగా నటించిన మలయాళ నటి లీలా.. సెంటిమెంట్ మరియు కామెడీ టైమింగ్స్ తో అలరించింది. సూరి కామెడీ టైమింగ్ అన్నీ చోట్ల పేలకపోయినప్పటికీ.. విశాల్ శోభనం ఎలా జరిగిందో తెలుసుకోవడం కోసం.. అమ్మమ్మతో కలిసి సూరి ఇంటికి వచ్చే సీన్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది.
రాధారవి తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు ఫర్వాలేదనిపించుకొన్నారు.
సాంకేతికవర్గం పనితీరు : ఇమ్మామ్ సమకూర్చిన బాణీల్లో తమిళ వాసన దట్టంగా కొడుతుంది. ఆ కారణంగా తెలుగువారికి పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ.. నేపధ్య సంగీతం మాత్రం అడగొట్టేశాడు. ముఖ్యంగా.. పోరాట సన్నివేశాలకు అందించిన ఆర్.ఆర్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది.
వేల్ రాజ్ ఛాయాగ్రహణం సినిమాకు మాస్ ఫీల్ ను తీసుకువచ్చింది. క్లైమ్యాక్స్ ఫైట్ లో ఎర్ర మట్టిలో హీరో మరియు విలన్ గ్యాంగ్ పోరాడే సన్నివేశానికి “బ్రౌన్ టింట్”ను వాడి సదరు సీన్ కు మంచి ఇంపాక్ట్ ను తీసుకువచ్చాడు.
ప్రవీణ్ ఎడిటింగ్ బాగుంది. సన్నివేశానికి మరో సన్నివేశంతో కలపడానికి వాడీన “స్లైడింగ్” ఎఫెక్ట్ బాగుంది. అనల్ అరసు కంపోజ్ చేసిన ఫైట్స్ మాస్ ఆడియన్స్ కు బాగా నచ్చుతాయి. అయితే.. ఇంటెర్వెల్ బ్యాంగ్ ఫైట్ మాత్రం మరీ అతిశయోక్తి అనిపించకమానదు. క్లైమాక్స్ ఫైట్ మాత్రం చాలా సహజంగా చిత్రీకరించాడు.
శశాంక్ వెన్నెలకంటి సమకూర్చిన సంభాషణలు తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా.. అనంతపురం మాండలికంలో వ్రాసిన సంభాషణలు అక్కడి ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటాయి. డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది. ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకపోవడం విశేషం.
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ముత్తయ్య తీసిన మూడో సినిమా “రాయుడు”. ఆయన మునుపటి చిత్రాల వలే ఈ సినిమాలోనూ తమిళ నేటివిటీ ఆడీయన్స్ ను ఆకట్టుకుంటుంది. ఆయన రాసుకొన్న కథ చాలా చిన్నది. ఆ కథను నడిపించిన కథనం మాత్రం అంత ఆసక్తికరంగా ఉండదు. ముఖ్యంగా.. కథలో కీలక మలుపులను సరిగా డీల్ చేయలేకపోయాడు.
హీరోయిన్ తల్లి హత్యను హీరోకు లింక్ చేయడంలోనే కాక.. హీరో అమ్మమ్మ పాత్ర చనిపోయే సన్నివేశాల చిత్రీకరణ సహజంగా ఉన్నప్పటికీ.. లాజిక్ మాత్రం సింక్ అవ్వదు.
సినిమాలో చెప్పుకోవడానికి చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అయితే, వాటిని సరైన పద్ధతిలో కవర్ చేసి దర్శకుడీగా తన ప్రతిభను చాటుకొన్నాడు ముత్తయ్య.
విశ్లేషణ : “రాయుడు” పక్కా మాస్ మసాలా సినిమా. కేవలం మాస్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేయబడి తీసిన సినిమా ఇది. సినిమాకు మహారాజా పోషకులు ఎలాగూ మాస్ ఆడియన్సే కాబట్టి “రాయుడు” వారిని అలరించడంలో వందశాతం విజయం సాధిస్తాడు.
అయితే,, చాలా సన్నివేశాల్లో లాజిక్ లు సరిగా ఉండవు. తనకు శత్రువులైన వారందర్నీ కర్కశంగా పీకలు కోసి చంపేసిన విలన్.. హీరో అమ్మమ్మను మాత్రం చలి జ్వరం వచ్చేలా చేసి మరణించేలా చేయడం వెనుక ఉన్న కారణం ఏంటో అర్ధం కాదు. అలాగే.. హీరో బలవంతుడు అని తెలిసినప్పటికీ.. అతడి చేతిలో చావడానికే రెడీగా ఉన్నట్లు, అక్కడే కూర్చొని ఉండడం లాంటి సన్నివేశాలు సినిమాకు మైనస్ అని చెప్పుకోవచ్చు.
అయితే.. లాజిక్ అనేది మన తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు కాబట్టి.. “రాయుడు” వారిని తప్పకుండా అలరిస్తుంది. క్లాస్ మరియు మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ మాత్రం సినిమాకు దూరంగా ఉండడం మంచిది.
ఫైనల్ గా చెప్పాలంటే..
మాస్ సినిమాలను ఆదరించే ఊర మాస్ ఆడియన్స్ కు మాత్రమే నచ్చే సినిమా “రాయుడు”.
రేటింగ్ : 2.5/5