తెలుగు, తమిళ పరిశ్రమలని తేడా లేకుండా చూసే హీరో విశాల్. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందు ఉంటారు. తెలుగు సినిమా పైరసీ అవుతుంటే తనకెందుకులే అని కామ్ గా ఉండరు.. ప్రమాదమని తెలిసినా పైరసీదారులను పోలీసులకు పట్టించారు. అలాగే తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ అవమానపరిస్తే ఈ విషయం మీద మా(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నడిగర్ సంఘానికి లేఖ రాసింది. దీనిపై నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ స్పందించారు. “ప్రతి విషయాన్ని ప్రేక్షకులు సీరియస్ గా తీసుకోనక్కర్లేదు. మహేష్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా ఏమీలేదు. ఆయన చాలా ఫేమస్.
మహేష్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసు.” అని మహేష్ గురించి గొప్పగా మాట్లాడారు. ఎవరో ఏదో అన్నారని అభిమానులు ఆందోళన చెందవద్దని, నిజానికి అంతా కమెడియన్ అంటున్న సదరు మనోజ్ ఎవరో కూడా తనకు తెలియదని విశాల్ చెప్పారు. ఇంకా మాట్లాడుతూ “ఓ పెద్ద సెలబ్రిటీని విమర్శిస్తే ఆటోమేటిగ్గా ప్రచారం వస్తుందని కొంతమంది భావిస్తుంటారు. ఇది చాలా కామన్. ప్రస్తుతం సోషల్ మీడియా ఇలానే పనిచేస్తోంది. అందుకే ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.” అని విశాల్ స్పష్టం చేశారు. అయితే మహేష్ అభిమానులు మాత్రం శాంతించడం లేదు. మనోజ్ ప్రభాకర్ ఏ వేదికపై అయితే మహేష్ ని విమర్శించారో.. అదే వేదికపై సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.