విష్ణు విశాల్… ఈ తమిళ హీరో నటన బాగుంటుంది, లుక్ బాగుంటుంది కానీ ఎందుకో ఇంకా మెయిన్ స్ట్రీమ్‌లోకి రావడం లేదు. పెద్ద సినిమాలు, విజయవంతమైన సినిమాలు చేస్తున్నా ఎక్కడో ఏదో మిస్ అవుతోంది. దీంతో అతని కథల ఎంపిక, సినిమా ఛాయిస్ విషయంలో చిన్నపాటి విమర్శలు వస్తుంటాయి. అయితే తాను సినిమాలు, పాత్రల ఎంపిక విషయంలో ఓ పద్ధతి ప్రకారమే ముందుకెళ్తాను అని క్లారిటీ ఇచ్చారు విష్ణు విశాల్.
విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘లాల్ సలామ్’. రజనీకాంత్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో విష్ణు విశాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్క్రిప్ట్ వినకుండానే సినిమా టీమ్‌ను చూసి సినిమాలు అంగీకరిస్తానని కొందరు అనుకుంటారు. కానీ, అది నిజం కాదు అని చెప్పాడు.
‘లాల్ సలామ్’ సినిమా కోసం ఐశ్వర్య తనను సంప్రదించినప్పుడు సమయం కావాలని అడిగానని, స్క్రిప్ట్ వివరించమని అడిగానని చెప్పాడు. అలా ఐదు గంటలు కథ విన్నాక సినిమా ఓకే చేశానని తెలిపారు. అయితే ఇలా అడిగినందుకు కొందరు తనకు అహంకారం ఉందని అనుకుంటారని కూడా చెప్పాడు. మంచి సినిమాల్లో మాత్రమే పని చేయాలని తాను అనుకుంటానని, కథ ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకుంటేనే అందులో నటిస్తాను అని చెప్పాడు.
అలాగే చిన్న చిన్న పాత్రలు చేయనని, హీరోగా విజయం సాధించాలనే ఇన్నేళ్లుగా కష్టపడుతున్నానని, పెద్ద స్టార్‌ల సినిమాల్లో బ్రదర్‌గా, సెకండ్ లీడ్‌గా అవకాశాలు వచ్చినా నో చెప్పానని తన కెరీర్ గురించి మాట్లాడారు. మంచి సినిమాల్లో మాత్రమే నటించాలనుకునే సినిమాలు ఓకే చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే రజనీకాంత్‌తో కలసి పని చేయాలనే తన కల ‘లాల్ సలామ్’ సినిమాతో తీరిందని చెప్పాడు. ఇక తాను (Vishnu Vishal) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలను రూమర్లని తేల్చేశాడు.